సమన్వయకర్త పోస్టుకి దరఖాస్తులు ఆహ్వానం


Ens Balu
6
Parvathipuram
2022-07-05 11:10:40

గ్రామ, వార్డు సచివాలయం పరిధిలో కమ్యూనికేషన్స్ విభాగంలో జిల్లా సమన్వయకర్త పోస్టును ఆరు నెలల కాలానికి నియమిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో సాంఘిక, ప్రవర్తన పరమైన మార్పుల కొరకు కమ్యూనికేషన్ విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ పోస్ట్ ను ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఆరు నెలల కాలానికి నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. నెలకు 48 వేల రూపాయలు ఏక మొత్తంగా వేతనం ఉంటుందని ఆయన పేర్కొంటూ నియామకం చెందిన అధికారి కోవిడ్, ఇతర సమస్యల పరంగా వస్తున్న ప్రవర్తనపరమైన మార్పులు పట్ల ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా మహిళలు, బాల్యవివాహాలు, ఇతర సామాజిక రుగ్మతలు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో ఏర్పాటు చేసే వివిధ సమావేశాల్లో సమన్వయ అధికారిగా పాల్గొంటూ సంబంధిత సమాచారాన్ని ఇతర శాఖలతో సమన్వయ పరచడం, ప్రజల వద్దకు తీసుకువెళ్లడం చేయాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా దీన్ని ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన చెప్పారు.

 ఈ పోస్ట్ కు దరఖాస్తు చేసే అభ్యర్థి కమ్యూనికేషన్స్, పబ్లిక్ రిలేషన్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్మెంట్ లేదా ఇతర విభాగాల్లో మాస్టర్  డిగ్రీ కలిగి ఉండాలని, జిల్లా, రాష్ట్రస్థాయి కమ్యూనికేషన్ విభాగాల్లో నాలుగు నుండి ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలని ఆయన వివరించారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాల పాటు కమ్యూనిటీ మొబిలైజేషన్ లేదా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్యం, ఐసిడిఎస్, పంచాయతీరాజ్, విద్య, రెవిన్యూ, మైనారిటీ, మున్సిపాలిటీ, సివిల్ డిఫెన్స్, సమాచార, ఫీల్డ్ పబ్లిసిటీ, మీడియా తదితర విభాగాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని వివరించారు. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక పరమైన విషయాల్లో స్పష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ విభాగాల్లో పని చేసే సామర్థ్యం ఉండాలని చెప్పారు. సొంత లాప్ టాప్,  మొబైల్ ఫోను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనం ఉండాలని, జిల్లాలో విస్తృతంగా పర్యటించుటకు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పారు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, డ్రాప్టింగ్, రైటింగ్ స్కిల్స్ తో పాటు మహిళా, శిశు అంశాల పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తెలుగు, ఇంగ్లీష్ లో ఫ్లూయెన్సీ ఉండాలని, కంప్యూటర్ విభాగంలో ఎమ్మెస్ ఆఫీస్ లో పనిచేసే సామర్ధ్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ పోస్ట్ కు ఈ నెల 6 నుండి 8వ  తేదీ వరకు దరఖాస్తులను సమర్పించాలని ఆయన చెప్పారు. గడువు దాటిన తరవాత అందిన దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవడం జరగదని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తులను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల జి.ఎస్.డబ్ల్యు.ఎస్ సమన్వయ అధికారి విభాగంలో 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 12వ తేదీన మౌఖిక పరీక్ష నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. పోస్టు భర్తీ ప్రక్రియను మార్పులు చేర్పులు చేయుటకు గాని, వాయిదా వేయుటకు గాని, ఎటువంటి సమాచారం లేకుండా భర్తీ ప్రక్రియను పూర్తిగా నిలుపుదల చేయుటకు గాని నియామక చైర్మన్ లేదా అధికారికి పూర్తి హక్కులు ఉన్నాయని ఆయన వివరించారు.