విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చిదిద్దాలి


Ens Balu
11
Paderu
2022-07-05 11:53:31

విద్యార్థులను క్రమ శిక్షణగా తీర్చి దిద్ది ఉన్నత విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా తయారు చేయాల్సిన భాద్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. మంగళవారం లోచలి పుట్టు గిరిజన సంక్షేమ శాఖ నెంబర్ వన్ పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటోందని, పిల్లలను ఉత్తమ పౌరులుగా, విద్యావంతులుగా తీర్చి దిద్దటానికి ప్రభుత్వ కృషి చేస్తోందని వివరించారు. ఇటీవల కోవిడ్  కారణంగా విద్య ఫై  చాలా ప్రభావం పడిందని, విద్య స్థాయి పడిపోయిందని ఆవేదన వ్యక్త పరిచిన కలెక్టర్ ఈ రోజు నుండి ప్రారంభమైన పాఠశాలలకు విద్యార్థులు ప్రతి రోజు శత శాతం హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతి పేద వారు కూడా పిల్లల్ని చదివించాలనే ఉద్దేశంతో జగనన్న విద్య కనుక కిట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు ఇందులో టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ , డిక్షనరీతో పాటు బేగ్, రెండు జతల యూనిఫామ్,షూస్, రెండు జతల శాక్స్ ఉంటాయన్నారు.   విద్యార్థులు చిన్నతనం నుండే పోటీతత్వం అలవరచుకోవాలి అందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. మన బడి నాడు-నేడు క్రింద పాఠశాలలను ఆధునీకరించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపిన కలెక్టర్ మొదటి విడతలో రూ. 104 కోట్లతో 367 పాఠశాలలు ఆధునీకరించామని. రెండో దశలో 393  పాఠశాలలు ఆధునీకరించనున్నామని వివరించారు.  జిల్లాలో అక్షరాస్యత శాతం కేవలం 54శాతం ఉందని, అక్షరాస్యత పెరుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ సూచించారు. అమ్మ ఒడి పథకం కింద లక్ష మంది వరకు లబ్ది పొందారని, విద్యార్థుల హాజరు శాతం 75 కు మించి ఉంటె మరికొంతమంది లబ్ది పొందేవారని తెలిపిన కలెక్టర్ తల్లిదండ్రులు పిల్లలను క్రమం తప్పకుండ పాఠశాలకు పంపాలన్నారు.  జగనన్న విద్య కానుక కిట్లను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా పంపిణీ చేయాలనీ,  బయో మెట్రిక్ కు సిగ్నల్ సమస్య ఉంటే సచివాలయాలు సహాయం తీసుకోవాలని డిఇఓను ఆదేశించారు. అదేవిధంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని కోరారు. కిట్ల పంపిణీలో, ఆధార్ అప్ డేషన్  లో  ఎంపిడిఓలు సచివాలయాల సిబ్బందికి తగు సూచనలు జారీ చేయాలనీ ఆదేశించారు.. 

        జిల్లా విద్యా శాఖాధికారి డా. పి  రమేష్ మాట్లాడుతూ జిల్లాలో 2,716 పాటశాలల్లో 1,58,989 మంది విద్యార్థులు ఉన్నారని, 1,58,914 కిట్లు వచ్చాయని,  ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ పంపిణీ చేస్తామని తెలిపారు. ఐదవ తేదీ నుండి 30 వ తేదీ వరకు  ప్రతి పాఠశాలలో రోజుకు 25 మందికి చొప్పున పంపిణీ జరుగుతుందని, ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ చేస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాడేరు ఎంపిపి రత్న కుమారి, ఎంఇఓ సరస్వతి, ప్రధానోపాధ్యాయులు జివివి ప్రసాద్, కృష్ణమూర్తి, ఎస్టీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధి ఎం శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.