ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీలు నిర్వహించాలి..


Ens Balu
2
Srikakulam
2020-09-19 18:46:14

శ్రీకాకుళం జిల్లాలో ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే  అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని, ఇందుకు నాడు - నేడు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఐ.సి.డి.ఎస్ పథక సంచాలకులు డా.జి.జయలక్ష్మి సి.డి.పి.ఓ లను ఆదేశించారు. సోమవారం  ఐ.సి.డి.ఎస్. కార్యాలయంలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణం, ప్రస్తుత భవనాల మరమ్మతులపై  సి.డి.పి.ఓ లతో ఆమె సమీక్షించారు. తొలుత పంచాయతీల వారీగా అద్దె భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల వివరాలు తెలుసుకున్న ఆమె ఇకపై ప్రభుత్వ భవనాల్లోనే అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని స్పష్టం చేశారు. నాడు - నేడు క్రింద అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అందులో భాగంగా అద్దె భవనాల్లోని అంగన్వాడీ కేంద్రాలు ఇకపై ప్రభుత్వ భవనాల్లో ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి, ఆ నివేదిక తమకు అందిస్తే వాటిని సంయుక్త కలెక్టర్ కు సమర్పించడం జరుగుతుందని చెప్పారు. నూతనంగా నిర్మించబోయే అంగన్వాడీ కేంద్రాలు సచివాలయాలకు, గ్రామాలకు దగ్గరలో ఉండేవిధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ భవనాల్లో ఉన్నటువంటి  అంగన్వాడీ కేంద్రాలకు మరామ్మతులు చేపట్టవలసివస్తే వాటి అంచనా వివరాలను తమకు అందజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టిని సారించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సి.డి.పి.ఓ లు, ఐ.సి.డి.ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.