పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవు


Ens Balu
11
Srikakulam
2022-07-08 13:56:17

శ్రీకాకుళం జిల్లాలో జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ద్వారా మంజూరైన పనుల్లో జాప్యం వహిస్తే చర్యలు తప్పవని, విధుల నుండి తప్పిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ జెజెఎం పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ ద్వారా పనులను చేపట్టేందుకు లక్ష్యాలు నిర్దేశించినప్పటికి నేటి వరకు పూర్తి చేయకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. తొలుత ఇప్పటివరకు చేపట్టిన పనులపై మండలాల వారీగా సమీక్షించిన కలెక్టర్ అనుమతులు ఉన్న పనులు కూడా ఇంజినీరింగ్ అధికారులు చేపట్టక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పగించిన చిన్న చిన్న పనులు కూడా చేపట్టని గ్రామీణ నీటిపారుదల శాఖ పనితీరు బాగులేదని అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు సంభందించిన బిల్లులు సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయని, అయినప్పటికీ పనులు ఎందుకు వేగవంతం కావడం లేదని ప్రశ్నించారు. పనులు వేగవంతం చేయడానికి  ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మూడు మాసాల్లో లక్ష్యాలను నిర్ధేశించినప్పటికి పూర్తి చేయలేకపోవడంపై వివరణ కోరారు. జిల్లావ్యాప్తంగా 20 వేలు కొళాయి కనెక్షన్లు ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారని, 700 మంది ఇంజినీర్లు ఉండి పనులు వేగవంతం కాకపోవడం సరికాదని అన్నారు. జిల్లాలో కొళాయి కనెక్షన్లు కావాలని కోరుతున్నవారు చాలా మంది ఉన్నారని,వారికి మంజూరుచేస్తే సరిపోతుందని, ఆ విషయం కూడా గ్రహించలేక పోతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న మంచి కార్యక్రమం ఇదని కలెక్టర్ గుర్తుచేశారు.

 ఇందులో అంచనాలు రూపొందించడానికి   జాప్యం ఎందుకు జరుగుతుందని, ఏడాది కాలంలో మీ పనితీరు సంతృప్తి కరంగా లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. బూర్జ మండలాన్ని సమీక్షిస్తూ 37 పనులకు ఎస్టిమేషన్ వేసి టెండర్లకు పిలిస్తే 8 పనులకు మాత్రమే టెండర్లు కన్ఫర్మ్ అయ్యాయని, మిగిలిన టెండర్లకు ఎవ్వరూ పాల్గొనక పోవడానికి కారణాలు తెలపాలని కలెక్టర్ కోరారు.  సహాయ ఇంజనీర్లు, గ్రామ స్థాయి ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో ప్రణాళికలు రూపొందించుకుంటే పనులు వేగవంతం చేయవచ్చని సూచించారు.పనుల పురోగతి సంతృప్తినిచ్చేలా ఎప్పటి కపుడు పరిశీలించుకొని ముందుకువెళ్లాలని అన్నారు. పనుల్లో పురోగతి లేకపోతే మీకు వెనుకకు పంపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జిల్లాలో 20 వేల కనెక్షన్లు పూర్తిచేసేందుకు 700 మంది ఇంజినీర్లు ఉన్నారని, ఒక్కో ఇంజనీర్ సుమారు 30 కనెక్షన్లు చేయవలసి ఉండగ, వాటిని కూడా చేయలేకపోయారని అన్నారు. పనుల నిర్వహణకు మెటీరియల్ అందుబాటులో ఉందని, పనుల నిర్వహణలో సాంకేతిక కారణాల సమస్యలు ఉంటే తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. శాఖకు సులభతరమైన లక్ష్యాలను నిర్దేశించామని, జూలై మాసాంతానికి లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అనంతరం కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ పనితీరుపై సమీక్షించిన ఆయన 614 ప్రదేశాల్లో స్థలం అందుబాటులో ఉందని, పనులకు సంబంధించిన చెల్లింపులు జరుగుతున్నాయని,నిధులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. బిల్లులు అప్లోడ్ చేసిన వెంటనే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు.కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కట్టడంలో 26 జిల్లాల్లో 24వ స్థానంలో ఉండడం అసంతృప్తిగా ఉందని, ఇకపై ప్రగతి కనబరచాలని అన్నారు. జూలై మాసాంతానికి ఇంకా 23 రోజులే సమయం ఉన్నందున త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్, కార్యనిర్వాహక ఇంజినీర్ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.