కేంద్ర ప్రభుత్వం అత్యవసర మందుల ధరలను తగ్గిస్తూ జారీ చేసిన ఆదేశాలు (జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్ధ-ఎన్‌పీపీఏ ఎఫ్.నెం. 8(99)/2022/డి.పి./ఎన్‌పిపిఏ`డిఐవి`11 తేది : 30`6`2022)ను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వానికి కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి పంపిన వినతిపత్రాన్ని శుక్రవారం అనకాపల్లిలో ఆయన ప్రసార మాధ్యమాలకు విడుదల చేశారు. రాష్ట్రంలోని అత్యధిక మందుల షాపులు యాజమాన్యాలు సవరించిన ధరలకు మందులు అమ్మడం లేదని, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం అధికారులు నిఘా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ తగ్గించిన మందుల ధరల జాబితాలో రక్తపోటు, మధుమేహం, జీర్ణాశయ సమస్యలు, కొలెస్ట్రాల్, గుండెపోటు, పక్షవాతం, నొప్పి నివారణల మొదలగు 84 రకాల అత్యవసర ఔషధాలున్నాయన్నారు. దీనివల్ల వినియోగదారులపై 30 నుంచి 40 శాతం మేర ఆర్ధిక భారం తగ్గనుందన్నారు. ఎక్కువగా సమ్మిళిత ఔషధాల (కాంబినేషన్ డ్రగ్స్) ధరలు అదుపులోకి వస్తాయన్నారు. ‘ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐపీడీఎంఎస్)’ ద్వారా మందుల ధరల జాబితాను ఔషధ తయారీదారులు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి రిటైలర్, డీలర్ ఔషధ ధరలు, అనుబంధ ధరల పట్టికలను వ్యాపార ప్రాంగణాల్లో బహిరంగంగా వినియోగదారులకు కనిపించేలా ప్రదర్శించాలని కాండ్రేగుల వెంకటరమణ ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ మేరకు వినతిపత్రాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఔషధ నియంత్రణ పరిపాలన విభాగాలకు పంపినట్టు మీడియాకి విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు.