జాతీయ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి..
Ens Balu
3
Srikakulam
2020-09-19 18:53:21
శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాలలో అత్యంత ప్రతిభ కనబరచిన విభిన్న ప్రతిభావంతులు, స్వచ్చంధ సంస్థలు భారత ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు కొరకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు కె.జీవనబాబు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురష్కరించుకొని సాంఘిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ వారు విభిన్నప్రతిభావంతులకు, స్వచ్చంధ సంస్థలకు అందించే జాతీయ పురస్కారం – 2020కు దరఖాస్తులను కోరుతున్నట్లు ఆయన చెప్పారు. దివ్యాంగుల పునరావాసం, స్వయం ఉపాధి, ఉద్యోగకల్పన, సాంకేతికత, క్రీడలు, అవరోధ రహిత వాతావరణం, అత్యుత్తమ సృజనాజ్మకత కలిగిన విభిన్నప్రతిభావంతులైన వయోజనులు, ఉత్తమ సృజనాత్మకత కలిగిన విభిన్నప్రతిభావంతులైన చిన్నారులు, ఉత్తమ బ్రెయిలీ ప్రెస్, ఉత్తమ ప్రాప్యత కలిగిన వెబ్ సైట్ మొదలగు రంగాల్లో కృషిచేసి అత్యంత ప్రతిభ కనబరచిన విభిన్న ప్రతిభావంతులు, స్వచ్చంధ సంస్థలు ఈ పురస్కారానికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల విభిన్నప్రతిభావంతులైన చిన్నారులు, వయోజనులు, స్వచ్చంధ సంస్థలు ఈ నెల 21లోగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, శ్రీకాకుళం వారికి మూడు సెట్లు సమర్పించాలని ఆ ప్రకటనలో కోరారు. ఇతర వివరాలు, నిబంధనల కొరకు www.disabilityaffairs.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని లేదా 08942 – 240519 నెంబరుకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.