స్పందన గ్రీవెన్స్ అర్జీలకు మనసు పెట్టి పరిష్కారం చూపించాలని, ఇప్పుడు వచ్చిన అర్జీలు మళ్లీ రీఓపెన్ కాకుండా నాణ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ స్పందన గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. స్పందన గ్రీవెన్స్ కార్యక్రమంలో 275 అర్జీలను ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్ లోనున్న స్పందన,ఏ.పి సేవా పోర్టల్ శాఖల వారీగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. అందిన దరఖాస్తులు మరల అదే అంశంపై రీ ఓపెన్ కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఒకవేళ దరఖాస్తులు రీ ఓపెన్ అయిన యెడల ఆయా దరఖాస్తులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరిస్తూ నాణ్యతతో పరిష్కార మార్గాలు స్పష్టతతో పూర్తి స్థాయిలో చూపాలని ఆదేశించారు.ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పట్ల జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని, బుధవారం ఉదయం నాటికి పూర్తీ కావాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నేషనల్ ఎడ్యూకేషనల్ పోలసీ 2020ను అనుసరించి, అశాస్త్రీయంగా ఆ విధానాన్ని అమలు పరచి పాఠశాలను విలీనం చేస్తూ అనేక మంది విద్యార్థిని, విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న జి.ఒ రద్దుచేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. పాతపట్నం మండలం గంగువాడ, చిన్నమల్లిపురం గ్రామానికి చెందిన సి.హెచ్.కృష్ణవేణి తమకు కాపునేస్తం మంజూరు చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.పలాస మండలం, నీలకంఠపురం గ్రామానికి చెందిన పీతాంబర జగన్నాథరావు తను గత 6 సంవత్సరాలనుండి ప్రజ్ఞా జూనియర్, డిగ్రీ కళాశాలలో వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నానని తనకు విధులు నుండి తొలగించారని న్యాయం చేయమని కోరుతూ దరఖాస్తు అందజేశారు.
జిల్లాలో రక్త కొరతను అధిగమించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. గత సంవత్సరం రెవెన్యూ శాఖ నుంచి 2 వేల యూనిట్స్ అందజేయడం జరిగిందన్నారు. అలానే ఉపాధ్యాయులు, డ్వామా సిబ్బంది సహకరించారని, ఈసారి అన్ని శాఖలు సమన్వయంతో జిల్లాలో రక్తం కొరత లేకుండా అధికమించేందుకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి అధిక మొత్తంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు ఎక్కువ సంఖ్యలో యూనిట్లు అందజేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాప్ టాప్ లను దివ్యాంగులకు కలెక్టర్ అందజేశారు. స్పందన వినతులు స్వీకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, డి.ఆర్.డి.ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ సి.ఇ.ఓ బి.లక్ష్మిపతి, ఎస్.ఇ ఇరిగేషన్ డోల తిరుమల రావు, ఎస్.ఇ, ఆర్ అండ్.బి ఎస్.ఈ కె.కాంతిమతి, డి.ఎస్.ఓ డి.వెంకటరమణ, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం.త్రినాథరావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.