అధిక వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి


Ens Balu
5
Parvathipuram
2022-07-12 07:40:54

పార్వతీపురం మన్యం జిల్లాలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లతో మంగళ వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ - 08963 293046 ఏర్పాటు చేశామన్నారు. వర్షాలు, వరదల వల్ల కలిగిన నష్టాల వివరాలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. గర్భిణీలను ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా వసతి గృహాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. అన్ని ముందస్తు చర్యలతో సిద్దంగా ఉండాలని ఆయన ఆదేశించారు. వరదలు తీవ్రత దృష్ట్యా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన పేర్కొన్నారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని, రవాణాకు బస్సులు, వాహనాలు సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో ఆహార సరఫరాకు ఏర్పాట్లు ఉండాలని, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. మధ్యాహ్న వంట ఏజెన్సీలను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. చిన్నారులు, వృద్దులు, గర్భిణీలు, బాలింతలను దృష్టిలో పెట్టుకొని వారికి అవసరమగు పాలు, బిస్కెట్లు, రొట్టెలు తదితర సామాగ్రిని సిద్దంగా ఉంచాలని ఆయన పేర్కొన్నారు. పంటలను కాపాడుకొనుటకు రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని వ్యవసాయశాఖను అదేశించారు. గ్రామ రెవిన్యూ అధికారి, గ్రామ వ్యవసాయ సహాయకులను అప్రమత్తం చేయాలన్నారు.  రోడ్లపై  చెట్లు పడిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే వెంటనే చెట్లను తొలగించుటకు అవసరమగు పరికరాలు, అందుకు కావలసిన మెషినరీ, కట్టర్స్, జె.సి.బిలు సిద్ధం చేసి తక్షణ చర్యలు చేపట్టుటకు వీలుగా వివిధ మండలాల్లో ఉంచాలని ఆర్ అండ్ బి, అగ్ని మాపక విపత్తుల శాఖను ఆదేశించారు. 

పంచాయతీరాజ్, ఇరిగేషన్ సిబ్బంది చెరువులు, అనకట్టలు తనిఖీ చేయాలన్నారు. సిబ్బంది 24 గంటలు అప్రమత్తం గా ఉండాలని, గేట్లు, లాకులు తనిఖీ చేసి సక్రమంగా పనిచేసేటట్లు చూడాలని, అవుట్ ఫ్లో సక్రమంగా ఉండే విధంగా చూడాలని ఆయన అన్నారు.  లోతట్టు  ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, రాకపోకలకు యిబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, నదులు, వాగులు, వంకలు, చెరువులను ఎవరూ దాటకుండా, దిగకుండా సూచనలు చేయాలని ఆయన తెలిపారు. మత్స్య శాఖ దేశీయ మత్స్యకారులకు సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు. వరదల సమయంలో ప్రజలు పాము, తేలు కాట్లుకు గురయ్యే ప్రమాదం ఉందని, వ్యాధులు ప్రభలుటకు అవకాశం ఉందని వాటి చికత్సకు కావలసిన మందులు సిద్ధం చేసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను అదేశించారు. వరదలు మరింత తీవ్ర రూపం దాల్చి విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉంటే తాగు నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ముందుగా టాంక్ లు నింపడం, జనరేటర్లను సిద్దంగా ఉంచడం చేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రులలో విద్యుత్ అంతరాయం వలన చికిత్సలకు ఆటంకం లేకుండా ముఖ్యంగా అత్యవసర శస్త్ర చికిత్సలకు ఇబ్బంది కలగకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లను సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం తక్షణం పునరుద్దరణకు సిబ్బంది, విడి పరికరాలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. విద్యుత్ అంతరాయం వలన కమ్యునికేషన్ వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని, సంభందిత టెలి ఆపరేటర్లు ముందస్తు ఏర్పాట్లు చేసి అంతరాయం కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తుఫాను, వరదల అనంతరం పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మునిసిపల్, పంచాయతీ అధికారులను ఆదేశించారు. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, వాటికి అవసరమగు ఆహారం అందించుటకు ఏర్పాట్లు చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. బ్లీచింగ్ , క్లోరినేషన్ నిల్వలు సిద్దంగా ఉంచాలని, తాగు నీటిని ఇంజినీరింగ్ సహాయకులు ద్వారా నెల రోజులు పాటు టెస్టింగ్ చేయాలని ఆయన ఆదేశించారు. పాఠశాలల్లో పారిశుధ్యం పక్కాగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యాసాగర్ నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ ఆర్. సుగుణాకర రావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఆర్. అప్పల నాయుడు, ఆర్. రామచంద్ర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బాలివాడ సత్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా ఉద్యానవన అధికారి కె.వి. సత్యనారాయణ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కిరణ్ కుమార్, రహదారులు భవనాలు శాఖ ఇంజినీరింగ్ అధికారి ఎం.జేమ్స్, పంచాయతి రాజ్ ఇంజినీరింగ్ అధికారి డా.ఎం.వి.జి.కృష్ణాజి, గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారి జె. శాంతీశ్వర రావు, డి.ఆర్.డి.ఏ పిడి వై.సత్యం నాయుడు, జిల్లా వ్యవసాయ రవాణా మార్కెటింగ్ అధికారి ఎల్.అశోక్ కుమార్, గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.రఘురాం, జిల్లా మత్స్య శాఖ అధికారి డి. గోపి కృష్ణ, జిల్లా పశు సంవర్థక అధికారి ఏ. ఈశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.