తుపానుపై అప్రమత్తంగా ఉండండి


Ens Balu
5
Visakhapatnam
2022-07-12 09:48:22

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో  అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లా  అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వరదలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అందరు జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు. వరదలకు సంబంధించి దెబ్బతిన్న పంటలు, చెరువులకు గండ్లు, విద్యుత్ సరఫరా ,రోడ్డు మరమ్మతులు తదితర పనులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. వీటికి సంబంధించిన నష్టాలను అంచనా వేసి నివేదికలను వేగవంతంగా పంపాలన్నారు. వరద బాధితుల పట్ల మానవతా దృక్పథాన్ని చూపించాలని, తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఉదారత చూపించాలని పేర్కొన్నారు. సచివాలయాల సిబ్బంది,  వాలంటీర్స్ సేవలను వినియోగించుకుని ప్రతి ఇంటికి సహాయం అందించాలని తెలిపారు. ఎవ్వరికి  అందలేదు అన్నమాట రాకూడదని, పునరావాస కేంద్రాలలొ ఉన్న వారికి మంచి వసతులు, సదుపాయాలు కల్పించాలని,వారికి అందించే సేవల్లో ఎక్కడ లోటు రానీయ కూడదని అధికారులను ఆదేశించారు.  ఈ వీడియో కాన్ఫరెన్స్లో  జిల్లా నుంచి కలెక్టర్ ఎ.మల్లిఖార్జున , జాయింట్ కలెక్టర్ కే .ఎస్.  విశ్వనాథన్ , జీవీఎంసీ కమీషనర్  జీ.లక్ష్మీషా, ఈపీడీసిఎల్ సిఎండి కే.సంతోష రావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస మూర్తి, జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు.