మహిళలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి...
Ens Balu
7
Visakhapatnam
2020-09-19 19:29:34
మహిళలు చట్టాల పట్ల అవగాహన కలిగి వుండాలని, మహిళల్లో న్యాయ పరమైన చైతన్యం రావాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి అవధానం హరిహర నాధ శర్మ పిలుపు నిచ్చారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ దిశా నిర్దేశంలో శనివారం పెందుర్తి జిల్లా సమాఖ్య టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన మహిళా న్యాయ అవగాహన సదస్సు కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహిళలు చట్టాల పట్ల అవగాహన పెంచుకొని చైతన్యం కావాలని కోరారు. విద్యావంతైన మహిళల్లో కూడా న్యాయ వ్యవస్థ, చట్టాల పట్ల సరియైన అవగాహన లేక పోవడం మూలంగా ఇంటా, బయటా తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సరియైన పోరాటం చేయలేక పోతున్నారని చెప్పారు. సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సహాయం పొందాలన్నారు. న్యాయ సేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబరుకు తమ సమస్యలు తెలపాలన్నారు. కరోనా పరిస్థితులలో మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, కరోనా పరిస్థితుల్లో మరింత జాగ్రత్తగా వుండాలన్నారు. జాతీయ మహిళా కమిషన్ ద్వారా శిక్షణ పొందిన న్యాయ వాదులు జహారా, బి.అనంతలక్ష్మి చట్టాలపై అంగన్వాడీ వర్కర్లు, సూపర్ వైజర్లు, సీడ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు, మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.కె.వి.బుల్లికృష్ణ, మహిళ శిశు సంక్షేమాధికారి సంతోషి కుమారి, సీడ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ వి.యస్.రాజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు , సిబ్బంది పాల్గున్నారు.