రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారీ వర్షాలు, వరదలపై సమీక్షించారు. ఈ సందర్భంగా గోదావరి ఉధృతి, వరద సహాయక చర్యలపై సీఎం జగన్ దిశనిర్దేశం చేశారు. ఈ సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహనరెడ్డి మాట్లాడుతూ.. ముందస్తు వర్షాల కారణంగా జులైలోనే గోదావరికి వరదలు వచ్చాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెలలోనే 10 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయని, అయితే కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటం వల్ల బుధవారం ఉదయానికి వరద పెరిగి, 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనివల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సర్వ సిద్ధంగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని స్పష్టం చేశారు. 24 గంటలూ కంట్రోలు రూమ్స్ నిర్వహించి, పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. వి.ఆర్.పురం, కూనవరం, అమలాపురం, వేలురుపాడుల్లో 4 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని చెప్పారు.
అవసరమైనచోట సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సహాయ శిబిరాల్లో ఏర్పాట్లు బాగుండాలని, మంచి ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని స్పష్టం చేశారు. సహాయక శిబిరాల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేల రూపాయలు ఇవ్వాలని, ఒక వ్యక్తికైతే వెయ్యి రూపాయలు అందజేయాలని ఆదేశించారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది పూర్తిగా అందుబాటులో ఉండాలని, అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలని కోరారు. గర్భిణులను అవసరమైన పక్షంలో ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. తాగునీటి పథకాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సరఫరాకు అంతరాయం వచ్చిన నేపథ్యంలో అత్యవసర సర్వీసులు నడిచేందుకు వీలుగా జనరేటర్లను అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటికోసం ట్యాంకర్లను సిద్ధంచేసుకోవాలని ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల పట్ల అప్రతమత్తంగా ఉండాలని, చెరువులు, ఇరిగేషన్‌కాల్వలు, రోడ్లు, కల్వర్టులు ఎక్కడ బలహీనంగా ఉన్నాయో గుర్తించి, అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, ఎస్‌పి ఎం.దీపిక, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్ఓ ఎం.గణపతిరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.