కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందని, చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో పనిచేసి జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కాకినాడ జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లాలో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి సంబంధీకులకు మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టరు కృతికా శుక్లా 18 మంది అభ్యర్థులకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల్లో ఖాళీలు ప్రకారం రిజర్వేషన్, రోస్టర్ ను అనుసరించి అభ్యర్థులకు ఉద్యోగాలను కేటాయించడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్యశాఖ శాఖ-6, శిశు మహిళా సంక్షేమం-2, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్-2, రెవిన్యూ, ఏపీఎస్పీ బెటాలియన్, పశుసంవర్ధక, పంచాయతీ, వ్యవసాయ, సెరీకల్చర్, కార్మిక, రిజిస్ట్రేషన్ తదితర శాఖలలో ఒకొక్క పొస్టు చొప్పున మొత్తం 18 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిందని కలెక్టరు తెలిపారు. కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే మంచి అవకాశం దొరికిందన్నారు. విధుల్లో చిత్తశుద్ధి, నీతి నిజాయితీతో ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో విధులు నిర్వర్తించి కాకినాడ జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని కలెక్టర్ అభ్యర్థులకు తెలిపారు.
కాకినాడ కొత్త జిల్లాగా ఏర్పడి వంద రోజులు అయిన సందర్భంగా ఇంత మందికి ఒకేసారి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు అందించడం సంతోషంగా ఉందని, దీని వెనక కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల అధికారులు, సిబ్బంది ముఖ్యంగా జిల్లా రెవెన్యూ అధికారి, కలెక్టరేట్ పరిపాలన అధికారి కృషి ఉందని కలెక్టరు ఈ సందర్భంగా కలెక్టరేట్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీధర్ రెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి జి.ఎస్.ఎస్ శ్రీనివాసు ఇతర అధికారులు పాల్గొన్నారు.