వైఎస్సార్ వాహనమిత్ర, 26న జగనన్న తోడు పథకాల కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని ఈ నెల 15న అందించే కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రారంభించనున్న నేపథ్యంలో వీటికి సంబంధించి జిల్లాలో గ్రామ, వార్డు స్థాయిలో సన్నద్ధత పనులను పూర్తిచేయాలని అధికారులను కలెక్టర్ డా. కృతికా శుక్లా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులతో కలిసి వర్చువల్ విధానంలో జిల్లాస్థాయి అధికారులు, ఆర్‌డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులతో ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలు, నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు, ప్రభుత్వ ప్రాధాన్య భవనాల నిర్మాణం, జగనన్న స్వచ్ఛ సంకల్పం, సీజనల్ వ్యాధులు తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని.. ఇందుకు ప్రతి నెలా నోటిఫికేషన్ జారీచేసి, వారం రోజుల్లో ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సంక్షేమ కార్యదర్శి/అసిస్టెంట్, ఏఎన్ఎం, మహిళా పోలీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు ప్రతి నెలా కనీసం ఒకసారి తమ పరిధిలోని పాఠశాలలను సందర్శించి, వివిధ అంశాలను తనిఖీ చేసి ప్రత్యేక యాప్‌లో పొందుపరిచేలా చూడాలని సూచించారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ఎస్‌హెచ్‌జీ మహిళలకు రూ. 35,000 అదనపు రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. 90 రోజుల్లో ఇంటిపట్టా జారీకి అవసరమైన భూ సేకరణకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు; రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తిచేయాలని.. వీటికి సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలన్నారు. సీజనల్ వ్యాధుల కట్టడి చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించాలని, ఫ్రైడే-డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. 15 రోజలకోసారి గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఫీవర్ సర్వే జరిగేలా చూడాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, సీపీవో పి.త్రినాథ్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వరనాయక్, మెప్మా పీడీ బి.ప్రియంవద, డ్వామా పీడీ ఎ.వెంకటలక్ష్మి, ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. ఆర్.రమేశ్, డీఈవో డి.సుభద్ర తదితరులు హాజరయ్యారు.