వాల్తేర్ రైల్వే లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్


Ens Balu
7
Visakhapatnam
2022-07-12 13:28:29

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవమే ఆజాదీకా ఆమ్రుత్ మహోత్సవ్ అని డీఆర్ఎం అనూప్ సత్పతి పేర్కొన్నారు. మంగళవారం విశాఖలోని వాల్తేరు రైల్వే డివిజన్ ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మహోత్సవాల్లో రైల్వే సాధించిన విజయాలను ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బైక్ ర్యాలీలో 75 మంది ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని, మరో ఐదు బైక్‌లపై 10 మంది ఆర్‌పిఎఫ్ సిబ్బంది వివిధ రాష్ట్రాల మీదుగా ప్రయాణించి  ఆగస్టు 14న న్యూఢిల్లీకి చేరుకుంటారని తెలియజేశారు.  ప్రతీ భారతీయుడు స్వాతంత్ర్య సమరయోధులను అనునిత్యం మననం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రైల్వే స్వచ్చతపైనా అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రైల్వే మ్యూజిక్ బ్యాండ్ తో దేశభక్తి గీతాలను ఆలపించారు.  ఈ కార్యక్రమంలో ఏడీఆర్ఎం (ఆపరేషన్స్)  మనోజ్ కుమార్ సాహూ, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్  సిహచ్.రఘువీర్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎకె త్రిపాఠి, సీనియర్ డివిజనల్ సిగ్నల్ & టెలికాం ఇంజనీర్ దీప్తాంశు శర్మ తదితరులు పాల్గొన్నారు.