శ్రీకాకుళంలో బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర శాఖ..
Ens Balu
2
Srikakulam
2020-09-19 19:36:44
శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర శాఖను జిల్లా కలెక్టర్ జె.నివాస్ శనివారం ప్రారంభించారు. ఎచ్చెర్లలో ఈ శాఖను ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ బ్యాంకు వినియోగదారులకు మంచి సేవలు అందించాలని కోరారు. వినియోగదారుల మన్ననలు పొందడం ద్వారా కార్యకలాపాలు బాగా నిర్వహించి వ్యాపారాన్ని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ఉపకులపతి డా.కూన రాంజీ మాట్లాడుతూ బ్యాంకు బాగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. బ్యాంకు జోనల్ హెడ్ దివేష్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటిది, ఆంధ్ర ప్రదేశ్ లో 18 వ శాఖ అన్నారు. దేశ వ్యాప్తంగా 1848 శాఖలు, 1882 ఏటిఎంలు ఉన్నాయని వివరించారు. బ్యాంకు మొత్తం బిజినెస్ 2.50 లక్షల కోట్లని, అడ్వాన్సులు లక్ష కోట్ల రూపాయలని, డిపాజిట్లు 1.50 లక్షల కోట్ల రూపాయలని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన హైదరాబాదు జోన్ పరిధిలో రూ.9,600 కోట్లు బిజినెస్ ఉండగా, అడ్వాన్సులు రూ. 7,200 కోట్లు, డిపాజిట్లు రూ.2,400 కోట్లు అని వివరించారు. 2019 డిశంబరులో డిజిటల్ లావాదేవీల నిర్వహణలో దేశంలోనే ప్రధమ స్ధానం పొందిందన్నారు. స్వయం ఉపాధి కోర్సుల నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన బ్యాంకుగా అవార్డు పొందడం జరిగిందన్నారు. ఉద్యోగులు, రైతులు, విద్యార్ధులు, పారిశ్రామికవేత్తలు తదితర అన్ని రంగాలకు బ్యాంకింగు సేవలు అందించడం జరుగుతుందని వివరించారు. ఉద్యోగులకు జీతాల ఖాతాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నామని, అటువంటి వారికి రూ.40 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. గృహ నిర్మాణ రుణాలు, వ్యవసాయ రుణాలు, వాహన రుణాలు తదితర అన్ని రంగాలకు సముచితమైన విధానంలో రుణాలు మంజూరు చేస్తామన్నారు. మహారాష్ట్రలో లీడ్ బ్యాంకుగా సేవలు అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ జివిబిడి హరి ప్రసాద్, యూనియన్ బ్యాంకు స్వయం ఉపాధి శిక్షణా సంస్ధ డైరక్టర్ ఎస్.బి.శ్రీనివాస్, మహారాష్ట్ర బ్యాంకు బ్రాంచి మేనేజర్ సి.హెచ్.అనిల్ కుమార్, విశాఖపట్నంకు చెందిన చీఫ్ మేనేజర్ బి. రామ్ శేఖర్, సీనియర్ మేనేజర్ ఎస్.శ్రీరామూర్తి, విజయవాడ నుండి బిజినెస్ డెవలప్ మెంటు అధికారి వై.తేజస్వీ తదితరులు పాల్గొన్నారు.