శ్రీవారి పాదాల చెంత గల ఎస్వీ ఉన్నత పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషనల్ ట్రస్టు సహకారంతో రాష్ట్రంలోనే గాక దేశంలోనే అత్యున్నతమైన విద్యాసంస్థల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని, గురుపూజ దినోత్సవం రోజు ఈ కార్యక్రమానికి నాంది పలకడం సంతోషకరమని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలలో చక్కటి మౌలిక సదుపాయాలు ఉన్నాయని, ఇక్కడ ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన విద్య అందుతోందని, విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారని చెప్పారు. తిరుమలకు విచ్చేసే ప్రముఖులు శ్రీవారి దర్శనానికి ముందుగానీ, తరువాత గానీ ఈ పాఠశాలను సందర్శించాలని కోరారు. రేమాండ్స్ గ్రూపు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం పలు ప్రాంతాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారని, వీటిలో దేశంలోనే అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం సింఘానియా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి రేవతి శ్రీనివాసన్ పలు రాష్ట్రపతి అవార్డులు సైతం అందుకున్నారని వెల్లడించారు. తిరుమలలోని ఎస్వీ ఉన్నత పాఠశాలను అకడమిక్స్ పరంగా అభివృద్ధి చేయాలని శ్రీ గౌతమ్ సింఘానియాను కోరగా సమ్మతించారని తెలిపారు. సింఘానియా ట్రస్టు పాఠశాల ఉపాధ్యాయులకు నైపుణ్య శిక్షణ అందిస్తుందని, విద్యార్థుల తల్లిదండ్రులతో తరచూ సమావేశాలు నిర్వహించి విద్యార్థుల ప్రగతిని చర్చిస్తారని చెప్పారు. పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులను టిటిడి కల్పిస్తుందన్నారు. భగవంతుడు అందరినీ ఒకేవిధంగా సృష్టించారని, ఎవరికైతే మంచి శిక్షణ అందుతుందో వారు రాణించగలుగుతారని చెప్పారు.
రేమండ్స్ గ్రూపు సిఎండి గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ ముంబయిలో శ్రీవారి ఆలయం నిర్మించే అపూర్వమైన అవకాశం తమకు దక్కిందని, ఈ అవకాశం ఇచ్చిన టిటిడి బోర్డుకు కృతజ్ఞతలు తెలియజేశారు. 47 సంవత్సరాలుగా తాను తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నానని, తిరుమల యాత్ర తన జీవితంలో ఒక భాగంగా మారిందని చెప్పారు. 52 ఏళ్ల క్రితం అప్పటి రేమండ్ గ్రూప్ ఛైర్మన్ సతీమణి సులోచనాదేవి సింఘానియా కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ సమయంలో ప్రమాద ఇన్సూరెన్స్ మొత్తం ఒక లక్ష రూపాయలు అందిందని చెప్పారు. అయితే వారి కుటుంబ సభ్యులు ఈ మొత్తాన్ని ఏదైనా ఒక సామాజిక హిత కార్యక్రమానికి ఖర్చు పెట్టాలని కోరారన్నారు. ఈ విధంగా ఒక లక్ష రూపాయల మూలధనంతో సులోచనా దేవి సింఘానియా పాఠశాల స్థాపన ప్రారంభమైందన్నారు. సులోచనా దేవి సింఘానియా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో సుమారు 20 వేల మంది విద్యార్థులు చదువుతున్నారని, ప్రిన్సిపాల్ రేవతి శ్రీనివాసన్ పర్యవేక్షణలో ఈ పాఠశాల ప్రగతి పథంలో నడుస్తోందని చెప్పారు.
తమ గ్రూపునకు సంబంధించిన ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతంలో కార్మికుల పిల్లల కోసం మొదటగా ఈ పాఠశాలను ప్రారంభించినట్టు తెలిపారు. ఇక్కడ మంచి విద్యను అందించి కార్మికుల పిల్లలను ఉన్నతస్థానాలకు చేర్చుతున్నట్టు చెప్పారు. ఏడాదికి లక్ష మంది పిల్లలకు విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా నెల రోజుల వ్యవధిలో ఈ పాఠశాలతో కలిపి 5 పాఠశాలల్లోని సుమారు 20 వేల మందికి విద్యను అందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. విద్యద్వారా మంచి పౌరులను తయారుచేసి జాతి నిర్మాణంలో భాగస్వాములను చేస్తామన్నారు. గడిచిన ఐదేళ్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉత్తమ పాఠశాలలుగా సింఘానియా పాఠశాలలకు గుర్తింపు దక్కిందన్నారు. మొదటగా ఎస్వీ ఉన్నత పాఠశాలను విద్యపరంగా అభివృద్ధి చేస్తామని, ఆ తరువాత టిటిడిలోని ఇతర పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన కృష్ణశేషాచల దీక్షితులు మాట్లాడుతూ తాను ఈ పాఠశాల విద్యార్థినేనని చెప్పారు. వినయంతో కూడిన విద్య అవసరమని, స్వామివారి ఆశీస్సులతో విద్యార్థులందరూ వృద్ధి చెందాలని కోరారు. ముందుగా ఈఓ ఎవి.ధర్మారెడ్డి, గౌతం సింఘానియా కలిసి పాఠశాలలో పూజలు నిర్వహించి కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో సంపంగి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో(ఆరోగ్యం, విద్య) సదా భార్గవి, ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, ద్యాశాఖాధికారి గోవిందరాజన్, డెప్యూటీ ఈవో రామారావు, సింఘానియా ట్రస్టు పాఠశాల ప్రిన్సిపాల్ రేవతి శ్రీనివాసన్, విజివో బాలిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి, సింఘానియా ట్రస్టు ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.