ఈ నెల 26,30 తేదీల్లో నిర్వహించనున్న బిజిలీ ఉత్సవాలను విజయవంతం చేయాలని, జిల్లా నోడల్ అధికారి, సింహాద్రి ఎన్‌టిపిసి డిప్యుటీ జనరల్ మేనేజర్ ఆనంద్‌బాబు కోరారు. ఈ ఉత్సవాల నిర్వహణపై స్థానిక ఇపిడిసిఎల్ కార్యాలయంలో బుధవారం సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా విద్యుత్ రంగంలో, ఈ 75 ఏళ్ల కాలంలో దేశం సాధించిన విజయాలను, ప్రగతిని మననం చేసుకొని, 2047 నాటికి వందేళ్ల కాలంలో సాధించాల్సిన లక్ష్యాలు, ప్రగతిపై చర్చించేందుకు ఉజ్జ్వల భారత్ - ఉజ్జ్వల భవిష్యత్ పేరుతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, పంపిణీ సంస్థలు ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ తదితర సంస్థలు కూడా పాల్గొంటాయని తెలిపారు.
మన జిల్లాలో ఎన్.టి.పి.సి.(నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్- సింహాద్రి యూనిట్)తో కలసి జిల్లా యంత్రాంగం, ఈ నెల 26న బొబ్బిలి వెలమ సామాజిక భవనంలో, 30న కలెక్టరేట్‌లో ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. విద్యుత్ రంగంలో దేశం సాధించిన ప్రగతిని, పునరుత్పాదక ఇంధన రంగంలో సాధించిన ప్రగతిని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించేలా, ప్రజలకు అవగాహన కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. దీనిలో భాగంగా విద్యుత్ వినియోగదారులతో ముఖాముఖి, విద్యుత్ అవసరాలు, సహజ ఇంధన వనరుల వినియోగం అంశాలపై సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. గ్రామాల శతశాతం విద్యుదీకరణ, గృహ విద్యుత్, విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం పెంపుదల, ఒకే దేశం - ఒకే గ్రిడ్, విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయడం, పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో సాధించిన అసామాన్య ప్రగతి, వినియోగదారుల హక్కులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రాంతీయ భాషల్లో రూపొందించిన తక్కువ నిడివిగల షార్టు ఫిల్మ్‌లను ఉత్సవాల సందర్భంగా ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను, వివిధ సంస్థల స్టాళ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా బిజిలీ ఉత్సవాల నోడల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం జెఎస్ఎన్‌పి ప్రసాద్, ఎపిఇపిడిసిఎల్ విజయనగరం ఇఇ(ఆపరేషన్స్) కృష్ణమూర్తి, బొబ్బిలి ఇఇ (ఆపరేషన్స్) పి.హరి, ఇఇ టెక్నికల్ ఎం.ధర్మరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.