జ్వరాల సమాచారం అందించండి


Ens Balu
2
Parvathipuram
2022-07-13 14:35:30

మన్యం జిల్లాలో  మలేరియా, డెంగ్యూ జ్వరాలను అరికట్టుటకు వాటికి సంబంధించిన సమాచారం అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు తెలిపారు. జ్వరాలు నివారణ చర్యలు, ప్రైవేటు ఆసుపత్రుల సహకారంపై  బుధవారం  ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, లాబరేటరీ టెక్నీషియన్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి బి.జగన్నాధరావు మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, ఫైలేరియా వ్యాదులు విజృంబిస్తున్నాయని వాటిని నియంత్రించుటకు ప్రైవేటు ఆసుపత్రులు సహకారం అవసరమని తెలిపారు. ఆసుపత్రులకు వస్తున్న మలేరియా, డెంగ్యూ పాజిటివ్ కేసుల వివరాలను దగ్గరలో గల పి.హెచ్.సి. కి తెలియజేయాలని తెలిపారు.  ఆయా కేసులు వచ్చిన గ్రామాలలో తక్షణ నివారణ చర్యలు తీసుకుంటామని అన్నారు. రక్త పరీక్షలు నిర్వహించి  వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి చికిత్స అందించటం జరుగుతుందని, తద్వారా ముందుగానే వ్యాదులు ప్రబలకుండా అరికట్టుటకు అవకాశం ఉంటుందన్నారు.  టి.బి. కేసుల వివరాలు కూడా తెలియజేస్తే వారికి ఉచితంగా మందులు, చికిత్స అందించడం జరుగుతుందన్నారు. 

ప్రైవేటు  ఆసుపత్రులు, స్కానింగు సెంటర్లు రిజిస్ట్రేషను చేయించుకోవాలని, రిజిస్ట్రేషను గల ఆసుపత్రులు రెన్యువల్ చేయించుకోవాలని తెలిపారు. స్కానింగు సెంటర్లలో లింగనిర్దారణ పరీక్షలు నిర్వహించకూడదని, చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. లింగనిర్దారణ వ్యతిరేక చట్టం ప్రకారం త్వరలోనే జిల్లా స్థాయి కమిటీ నియామకం జరుగుతుందన్నారు.  డెలివరీలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఆరోగ్యరక్ష ద్వారా  డబ్బులు చెల్లిస్తున్నదని అందుకొరకు డెలివరీ  వివరాలు సంబంధిత యాప్స్ నందు తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. ప్రజలు దోమలు కుట్టకుండా దోమ తెరలు వాడాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకొనేలా అవగాహన కల్పించాలని అన్నారు. 

బలిజపేట మండలం పినపెంకి గ్రామంలో ఫైలేరియా కేసులు సుమారు పదిహేను వందలు  ఉన్నాయని, అనేక సంవత్సరాలుగా గ్రామస్తులు బాధపడుతున్నారని గుర్తించడం జరిగిందని, దీనిపై  ప్రణాళిక తయారుచేసుకొని రక్తపరీక్షలు నిర్వహించుట, చికిత్స, గ్రామంలో దోమలు నివారణ, పరిసరాల పరిశుభ్రత మొదలైన అంశాలపై ఒకేసారి చర్యలు చేడతామని తెలిపారు. ఐ.ఎం.ఎ. సెక్రటరీ డా. శేషగిరిరావు మాట్లాడుతూ ప్రజలు సరియైన పోషక ఆహారం తీసుకోకపోవడం వలననే వ్యాదులబారిన పడుతున్నారని, మంచి ఆహారం తీసుకోనుట వలన వ్యాధినిరోదకత పెరిగి వ్యాదుల రావని,  తక్కువ మందులు వినియోగంతో వ్యాదులను తగ్గించుకోవచ్చని తెలిపారు. కావున ప్రజలు బలవర్దకమైన పౌష్టికాహారం తీసుకొనేవిధంగా అవగాహన కల్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారిణి డా. వాగ్దేవి,   ఎ.పి.ఎన్.ఎ. ప్రెసిడెంట్ డా. డి.రామమోహన్ రావు, జిల్లా మలేరియా అధికారి డా. కె.పైడిరాజు, డిప్యూటీ డి.ఎం .హెచ్.ఒ.లు డా. సి. దుర్గాకళ్యాణి, డా. బి. నివాసరావు,, ప్రైవేటు ఆసుపత్రులు డాక్టర్లు, లేబరేటరీ టెక్నీషియన్లు పాల్గొన్నారు.