నెల్లూరులో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు 5 రోజుల పాటు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం వైభవోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా పలు ప్రాంతాల్లో శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ అధికారులు వైభవోత్సవాల నిర్వహణకు ఆకట్టుకునేలా పైకప్పుతో కూడిన వేదిక, భక్తులు కూర్చునేందుకు గ్యాలరీలు, క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్లు, లడ్డూ విక్రయ కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, పోటు, సైన్‌బోర్డులు తదితర ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు, ప్రత్యేక లైటింగ్, ఎల్ఇడి డిస్‌ప్లే స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు లేకుండా సిసి కెమెరాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేయాలని సివిఎస్వోను కోరారు. టిటిడిలో ఇటీవల చేపట్టిన కార్యక్రమాలపై ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులను ఆహ్వానించాలని కోరారు. ఈ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. ఈ సమీక్షలో జెఈఓలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈవో షణ్ముఖకుమార్, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.