కమిషనర్ ను మెప్పించిన ఎమినిటీ కార్యదర్శి


Ens Balu
8
Kakinada
2022-07-14 10:09:41

విధి నిర్వహణలో  ఓ సచివాలయ ఉద్యోగి చూపించిన అంకితభావం  అధికారుల ప్రశంసలు అందుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోయినా ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను పూర్తి చేయాలన్న  అతని తపన సాటి ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. వివరాలు తెలుసుకుంటే.. ఆర్.ఈశ్వర్ కాకినాడలోని 5A సచివాలయంలో ఎమినిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నవరత్నాలు -పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన పండూరు లేఅవుట్ లో జియో టాగింగ్ ప్రక్రియ వేగవంతం చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయితే తప్ప లబ్ధిదారులు ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశం లేదు. జియో టాగింగ్ చేయాలంటే వాతావరణ పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. ఓవైపు ఎడతెరిపిలేని వర్షం.. మరోవైపు ఆ వర్షం కారణంగా కేటాయించిన స్థలాల్లో నీరు నిలిచిపోవడం వంటి  ప్రతికూల పరిస్థితులు ఎదురుపడ్డాయి. అయినప్పటికీ ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను ఎలాగైనా పూర్తి చేయాలనే సంకల్పంతో బురద నీటిలోనే వెళ్లి జియోటాగింగ్ ప్రక్రియ కొనసాగించారు. ఇందుకు సంబంధించిన సమాచారం, ఫోటో అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్ కే. రమేష్ ఏమినిటీ కార్యదర్శి ఈశ్వర్ ను ప్రత్యేకంగా అభినందించారు. పదిమందికీ ఆదర్శంగా నిలిచిన ఈశ్వర్ తరహా లోనే మిగిలిన ఉద్యోగులు కూడా కష్టించి పనిచేయాలని కమిషనర్ రమేష్ కోరారు.  ముఖ్యంగా లబ్ధిదారులు కూడా ముందుకు వచ్చి వేగంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు.