100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు100ఏళ్లలో ఇలాంటి భారీ వరదలు చూడలేదు ఉబయ గోదావరి జిల్లాల్లో గత 100 సంత్సరకాలంలో ఎన్నడూ లేనివిధంగా భారీ ఎత్తున వరద నీరు వొచ్చే అవకాశం ఉండటంతో హెచ్చరికలు జారీ చేస్తున్నామని.. ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా ఇంఛార్జి,సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియాల్ సర్వే లో భాగంగా మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరద తీవ్రత హెచ్చరికలను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువగా అంచనా వెయ్యవద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైందని, ప్రజలను ముందస్తు చర్యలలో భాగంగా లోతట్టు ప్రాంతాల నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం జరుగుతోందని తెలిపారు. ప్రజలు సహకారం అందించి, స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం తక్షణ సహాయంగా 10 కేజీలు బియ్యం, ఇతర అత్యవసర సరుకులు అందించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో మందులు, త్రాగునీరు, దుప్పట్లు ఇతర సదుపాయలు కల్పించామన్నారు.
గతంలో ఎన్నో వరదలను చూసాము, మాకు ఏదీ కాదనే నిర్లక్ష్యం వద్దని, ఏ రాత్రి సమయంలో నైనా ఎవ్వరికీ అంచనాకు రాని స్థాయి లో వరద నీరు రావచ్చు నని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. త్రాగునీటి విషయంలో కాచి వడబోసిన నీటినే తాగలన్నారు. భద్రాచలం వద్ద 70 అడుగులు మించి నీరు ప్రవహిస్తోందన్నారు. ఇప్పటికే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామని, పశువుల కు గ్రాసం సిద్దం చేశామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముంపు ప్రాంతాలలో దేవిపట్నం, చింతూరు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. వరద నష్టాన్ని ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో అధికారులు అంచనా వేసి, ఒక అంచనాకు వొచ్చి తదుపరి తీసుకోవలసిన జాగ్రత్తలు, చర్యలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు.