టిటిడి గోసంరక్షణశాలను మరో ఏడాదిన్నరలోగా దేశంలోనే ఆదర్శవంతమైన గోశాలగా అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలను శుక్రవారం సాయంత్రం ఈవో పరిశీలించారు. ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్, నెయ్యి తయారీ కేంద్రం పనులను పరిశీలించారు. అలాగే గోవసతి షెడ్లు, అందులో గోవులకు సౌకర్యంగా ఉండేందుకు ఇసుకతో ఏర్పాటుచేసిన మైదానం, ఉత్తరాది రాష్ట్రాల నుంచి గోశాలకు తీసుకొచ్చిన కాంక్రీజ్, ఘిర్, సాహివాల్ జాతుల గోవులతోపాటు పుంగనూరు, ఒంగోలు జాతుల గోవులను పరిశీలించి వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోవసతి షెడ్లలో గోవులకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటుచేసిన సంగీతం బాగుందని, ఇక్కడ గోవులకు నిరంతరం మేత, నీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 18 షెడ్లకు గాను 4 షెడ్ల నిర్మాణం పూర్తయిందని, మిగిలిన 14 షెడ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫీడ్‌మిక్సింగ్ ప్లాంట్ పనులు డిసెంబరు నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గోశాలను అందంగా ఉంచేందుకు, గోశాలకు వచ్చే సందర్శకులకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపారాధన, నైవేద్యాల తయారీకి అవసరమయ్యే నెయ్యి ఉత్పత్తి చేసేందుకు సుమారు 600 గోవులు అవసరమవుతాయని చెప్పారు. ఇందులో ఇప్పటివరకు 100కు పైగా వివిధ దేశీయజాతుల గోవులను సమకూర్చుకున్నామని, మిగిలిన గోవులను దాతల ద్వారా సమీకరించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వివరించారు. పశువైద్య విశ్వవిద్యాలయంతోపాటు దాని పరిధిలోని కళాశాలల్లో చదివే విద్యార్థులకు ఎస్వీ గోశాలలో ఇంటర్న్‌షిప్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల విద్యార్థులకు పరిజ్ఞానం పెరగడంతోపాటు గోశాలకు వారి సేవలు అందే అవకాశం ఉంటుందన్నారు. జెఈవో వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి, ఎస్వీ పశువైద్య వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ వెంకటనాయుడు పాల్గొన్నారు.