చమురు, సహజ వాయువుల సంస్థ ఓఎన్‌జీసీ పేద వర్గాలకు అందిస్తున్న సేవలు ఆదర్శప్రాయమని కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ కె. రమేష్ పేర్కొన్నారు. స్థానిక స్మార్ట్ సిటీ కార్యాలయంలో గురువారం సాయంత్రం నగర పాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్ సోర్సింగ్ కార్మికులు, డ్రైవర్లు 1200 మందికి రూ. 9.6 లక్షల విలువైన నిత్యావసర సరుకులు ఓఎన్‌జీసీ అందజేసింది. ఈ కార్యక్రమానికి ఓఎన్‌జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అసెట్ మేనేజర్ ఆదేశ్‌కుమార్ అధ్యక్షతన వహించారు. సమావేశంలో కమీషనర్ మాట్లాడుతూ గతంలో కూడా ఓఎన్‌జీసీ సంస్థ పారిశుధ్ద్య కార్మికుల కోసం విధి నిర్వహణలో ఉపయోగించే వస్తువులను సమకూర్చిందన్నారు. కోవిడ్ సమయంలోనూ సంస్థ పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు కొనసాగించిందన్నారు. ఇప్పుడు కూడా కార్మికులకు సంస్థ అండగా నిలబడటం అభినందనీయమని ప్రశంసించారు. ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నప్పుటికీ ప్రతీ ఒక్కరికీ ఈ సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ఓఎన్‌జీసీ ఈడీ ఆదేశ్‌కుమార్ మాట్లాడుతూ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కోవిడ్ సమయంలో విశేష సేవలందించిన కార్మికులకు సేవ చేసే అవకాశం దొరకడం ఆనందదాయకమన్నారు. భవిష్యత్తులోనూ సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 1 నుంచి 15 వరకు జరుగుతున్న స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా అక్కడకు విచ్చేసిన కార్మికులు, ఉద్యోగులతో కమీషనర్ రమేష్ పరిశుభ్రతా ప్రతిజ్ఞ చేయించారు. వారానికి రెండు గంటలు శ్రమదానం చేసి పరిశుభ్రత పట్ల తమ కర్తవ్యాన్ని నెరవేరుస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ సీహెచ్ నాగ నరసింహారావు, ఓఎన్‌జీసీ సీజీఎం సూర్యనారాయణ, హెచ్‌ఆర్ మేనేజర్ ఆర్. శంకర్, కార్పోరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృధ్వీచరణ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.