పరిస్థితులకు అనుగుణంగా సహాయక చర్యలు
Ens Balu
2
Dowleswaram Barrage
2022-07-16 07:42:39
తూర్పుగోదావరి జిల్లాలో వరద పరిస్థితి అనుగుణంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించడం జరిగిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. శనివారం ధవళేశ్వరం బ్యారేజీ వ్యూ పాయింట్ వద్ద నుంచి వరద పరిస్థితి పై ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కే. మాధవీలత తో సమీక్షించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం వద్ద వరద ఉదృతి, దిగువకు వరద నీరు విడుదల సమయంలో చేపడుతున్న రక్షణ చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముంపు ప్రాంతాలలోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ బృందాలతో క్షేత్ర స్థాయి లో తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. జిల్లా వరదల పర్యవేక్షణ బాధ్యతలను చేపట్టిన ప్రత్యేక అధికారి హెచ్. అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ప్రస్తుత వరద పరిస్థితి ని మంత్రికి వివరించారు. ముంపు గ్రామాలలోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరడం జరిగిందని, కొందరు పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధపడటం లేదని, ముంపుకు గురికాము అనే ధీమా తో ఉన్నట్లు తెలిపారు. వరద పరిస్థితి కి అనుగుణంగా అవసరమైన పక్షంలో ప్రతి ఒక్కరిని తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. ఇరిగేషన్ ఎస్ ఈ నరసింహరావు గోదావరి బండ్ల పరిస్థితి, వాటి పటిష్టత కోసం తగిన చర్యలు తీసుకున్నామని తెలిపారు. మంత్రితో పాటు పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, రూడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.