కాకినాడ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో నాడు-నేడు కింద చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ కోర్టుహాల్‌లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు-నేడు కింద చేపట్టిన మరమ్మతులు, ఆధునికీకరణ తదితర పనుల పురోగతిపై కలెక్టర్ కృతికా శుక్లా.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజనీరింగ్ అధికారులు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తునిలోని 100 పడకల ఏరియా ఆసుపత్రి ఆధునికీకరణ, ఏలేశ్వరం సీహెచ్‌సీ సామర్థ్యాన్ని 30 పడకల నుంచి 50 పడకలకు పెంపుతో పాటు పెదపూడి సీహెచ్‌సీ, జగ్గంపేట సీహెచ్‌సీ, తాళ్లరేవు సీహెచ్‌సీ, ప్రత్తిపాడు సీహెచ్‌సీ, రౌతులపూడి సీహెచ్‌సీ తదితర ఆసుపత్రుల్లో చేపట్టిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలతో పనులు జరిగేలా చూడాలని.. ఇందుకు ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు ప్రతి వారం సమీక్ష చేయాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రాధాన్యక్రమంలో ప్రణాళికాయుతంగా పనుల పూర్తికి కృషిచేయాలన్నారు. కాంట్రాక్టు సంస్థలు లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తిచేసేలా చూడాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీఎంఎస్ఐడీసి ఈఈ కె.సీతారామరాజు, డీసీహెచ్ఎస్ డా. పీవీ విష్ణువర్థిని, ఏపీఎంఎస్ఐడీసి డీఈలు ఎన్ఎస్. చక్రవర్తి, బి.రుసేంద్రుడు, వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.