ప్రభుత్వ నిర్ణయించిన ఎం.ఆర్.పి. ధరలకే ఎరువులను విక్రయించాలని, అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి అధిక ధరలకు విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని జిల్లాలోని ఎరువుల డీలర్లను జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాలని, వారితో సఖ్యతగా మెలగాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎరువుల డీలర్లతో జేసీ శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు ఎరువుల విక్రయంలో అనుసరించాల్సిన నిబంధనలు, నియమావళి గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. అధిక లాభాపేక్షకు పోకుండా రైతుల పట్ల సేవా దృక్పథాన్ని డీలర్లు కనబరచాలని జేసీ హితవు పలికారు. ఎరువుల కృత్రిమ కొతర సృష్టించటం, నిబంధనలు అతిక్రమించటం లాంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మంచి చేయాలనే దృక్ఫథంతో ముందుకు వెళ్తోందని దానికి అనుగుణంగా మనందరం నడుచుకోవాలని పేర్కొన్నారు. కల్తీ ఎరువులు విక్రయించినా.. అధిక ధర వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. రైతు భరోసా కేంద్రాలు, ఎరువుల దుకాణాల వద్ద ఎం.ఆర్.పి. ధరలు వేస్తూ ధరల పట్టికను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను, డీలర్లను జేసీ ఆదేశించారు. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. నానో యూరియా, పొటాస్ ప్రయోజనాలను రైతులకు తెలియజేయాలని, వాటి వినియోగాన్ని పెంచాలని డీలర్లకు సూచించారు. ఏ రోజుకా రోజు ఎరువుల విక్రయానికి సంబంధించిన నివేదికను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని, బిల్లుల పుస్తకాలను, స్టాక్ రిజిస్టర్లను మెయింటైన్ చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వి.టి. రామారావు, ఏడీ అన్నపూర్ణ, పరిశోధక అధికారి ప్రకాశ్, మండల వ్యవసాయ అధికారులు, అధిక సంఖ్యలో డీలర్లు తదితరులు పాల్గొన్నారు.