క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులు వచ్చినప్పుడు మండల స్థాయి అధికారులు తగిన రీతిలో స్పందించాలని, వారు అడిగిన సమాచారం అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి ఆదేశించారు. తనిఖీల్లో భాగంగా ప్రత్యేక అధికారులకు అన్ని విధాలా మండల అధికారులు, సచివాలయ సిబ్బంది సహకరించాలని సూచించారు. అలాగే మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశాలకు అన్ని విభాగాల మండల స్థాయి అధికారులు తప్పుకుండా హాజరు కావాలని, బాధ్యతగా ఉండాలని ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో సోమవారం జిల్లా కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రత్యేక అధికారులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీలకు వెళ్లినప్పుడు కొంతమంది సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, కొంతమంది సరిగా స్పందించటం లేదని చెప్పారు. ప్రధానంగా రాజాం పరిధిలోని తనిఖీలకు వెళ్లినప్పుడు ఈ సమస్య ఎదురవుతోందని కలెక్టర్ కు వివరించగా ఆమె పై మేరకు స్పందించారు. అన్ని మండలాల అధికారులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, బాధ్యతగా ఉండాలని ఆమె ఆదేశించారు.