ఏస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం (ఏడీపీ)లో భాగంగా నిర్ణీత లక్ష్యాలను చేరుకొని, ఇప్పటి కంటే మెరుగైన ర్యాంకు సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. నీతి ఆయోగ్ నిర్దేశించిన అన్ని ఇండికేటర్లలో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రతి విభాగం తన వంతు పాత్ర పోషించాలని సూచించారు. ముఖ్యంగా జిల్లాలోని చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని, పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేయాలని చెప్పారు. పారిశుద్ధ్యంపై, ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని, ఆరోగ్య కర సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. గ్రామాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, సీజనల్ వ్యాధులు ప్రబల కుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. చిన్న వయసులోనే వివాహం అనర్థాలకు దారి తీస్తుందని, తల్లి పిల్లా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని దీనిపై ప్రత్యేక దృష్టి సారించి బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. అలాగే తల్లిపాల శ్రేష్ఠత గురించి ప్రతి తల్లికీ తెలియజేసి.. బిడ్డ ఆరోగ్యాన్ని సంరక్షించాలని చెప్పారు. విద్య, వైద్యం, ప్రజా ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి అన్ని రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించటం ద్వారా నీతి ఆయోగ్ ర్యాంకింగ్‌లో జిల్లా మెరుగైన స్థానంలో ఉండేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ ఇండికేటర్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీపీవో బాలాజీ వివరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీవో బాలాజీ, ఐసీడీఎస్ పీడీ శాంత కుమారి, డీఎం & హెచ్ వో రమణ కుమారి, డీఈవో విజయ శ్రీ, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.