విజయనగరంజిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అధికారుల సమన్వయ కృషి అవసరమని, ఆ దిశగా ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి పేర్కొన్నారు. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించుకోవాలని, తరచూ క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో ఆమె స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై, ప్‌వజా సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా ప్రతి మండల ప్రత్యేక అధికారి ఇటీవల కాలంలో తన పర్యటించిన గ్రామాల్లో గుర్తించిన సమస్యలను, మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశాల్లో చర్చించిన అంశాల గురించి కలెక్టర్‌కు వివరించారు.
క్షేత్ర స్థాయి పర్యటనల్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి, కన్వర్జెన్సీ సమావేశాల్లో చర్చకు వచ్చిన అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ సూర్యకుమారి ఈ సందర్భంగా మార్గనిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో.. సౌకర్యాల కల్పనలో చొరవ చూపాలని సూచించారు. సఖి గ్రూపులను, స్పోర్ట్స్ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని చెప్పారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్ సెంటర్లు, డిటిజల్ లైబ్రరీల నిర్మాణాలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. వివిధ విభాగాల్లో సిబ్బంది, అధికారులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. పాల్ నగర్‌లో అంగన్ వాడీ కేంద్రాన్ని స్థానికులకు అందుబాటులో ఉండే చోటుకు మార్చాలని, పీపీ-1,2 పాఠ్యాంశాల బోధనపై వర్కర్లకు అవగాహన కల్పించాలని ఐసీడీఎస్ పీడీని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా బాలికా విద్యపై అందరూ దృష్టి సారించాలని సూచించారు.
గ్రామాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కొత్తవలస, పెదతాడివాడ, రఘుమండ తదితర జగనన్న కాలనీల్లో త్వరితగతిన విద్యుత్ సదుపాయం కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్. కోటలో తాగునీటి ట్యాంకు పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ.కి సూచించారు. మెంటాడ కేజీబీవీలో కంప్లైంట్ బ్యాక్స్ ఏర్పాటు చేయాలని, వాటిని పరిశీలించి నివేదిక అందజేయాలని ప్రత్యేక అధికారిని ఆదేశించారు. వివిధ విభాగాల్లో ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని, అమ్మ ఒడి నగదు జమ కాకపోవడానికి గల కారణాలను విశ్లేషించి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జగనన్న విద్యాకానుక కిట్లను అందరికీ అందజేయాలని, వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పారు. పీహెచ్‌సీల్లో సిబ్బంది సమయ పాలన పాటించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, సీపీవో బాలాజీ, జడ్పీ సీఈవో అశోక్ కుమార్, విజయనగరం మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నాయుడు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, మెప్మా పీడీ సుధాకర్, డీఎం&హెచ్‌వో రమణ కుమారి, ఎస్.ఎస్.ఎ. పీవో స్వామినాయుడు, డీసీవో అప్పలనాయుడు, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, మత్స్యశాఖ అదనపు సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. గుప్తా ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.