తిరుమలలో గదులు పొందిన భక్తులకు అక్కడ ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టం సత్ఫలితాలనిస్తోందని టీటీడీఈవో ఎవి. ధర్మారెడ్డి చెప్పారు. ఇదే విధానాన్ని తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల్లోని రిసెప్షన్ విభాగంలో కూడా ప్రవేశ పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలో సోమవారం ఈవో సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, తిరుపతి గోశాలలో నిర్మిస్తున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ నిర్మాణం పనులు ఈ ఏడాది డిసెంబర్‌కు పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలలో శ్రీ తరిగొండ వెంగమాంబ ధ్యాన మందిరం నిర్మాణం పనులను ఆగస్టు నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. తిరుమలలో పరిశుభ్రతను మరింత పెంచి భక్తులకు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించడానికి ఆలిండియా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ వారి సహకారం తీసుకోవాలని ఆరోగ్యాధికారికి సూచించారు.
టీటీడీ ఆలయాలతో పాటు, ఇటీవల విలీనం చేసుకున్న ఆలయాల్లో కూడా గోపూజ నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు. అనంతరం తిరుమలకు వెళ్ళే భక్తుల లగేజి రవాణాకు సంబంధించి జిఎంఆర్ ప్రతినిధులతో ఈవో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, తిరుమలకు వెళ్ళే భక్తుల లగేజి రవాణా చేసి త్వరగా సులభరీతిలో తిరిగి పొందేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించాలని కోరారు. లగేజీ కౌంటర్ల నిర్వహణపై సివిఎస్వో నరసింహ కిషోర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సమావేశంలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబిసి సిఈవో షణ్ముఖ కుమార్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.