ఇంటర్న్ షిప్ తో నైపుణ్యాలు పెరగాలి


Ens Balu
5
Parvathipuram
2022-07-19 08:05:37

డిగ్రీ విద్యార్థులకు కల్పించే ఇంటర్న్ షిప్ కార్యక్రమంతో విద్యార్థులలో నైపుణ్యాలు పెరగాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. విద్యార్థుల ఇంటర్న్ షిప్ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, శ్రీకాకుళం డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సి.హెచ్. ఏ.రాజేంద్ర ప్రసాద్, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులుగా తయారు కావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అందుకు గల అన్ని అవకాశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆయన అన్నారు. విద్యార్థుల భవితకు బంగారు బాటలు పడాలని పేర్కొన్నారు. డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు మూడవ సంవత్సరంలోకి అడుగు పెట్టే నాటికి ఆరు నెలల ఇంటర్న్ షిప్ కార్యక్రమం పూర్తి కావాలని, అదే సమయంలో స్వయం ఉపాధి పొందుటకు పూర్తి స్థాయిలో అవకాశాలు ఉండాలని వివరించారు. డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ఉపాధి అవకాశాలు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్న్ షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసిందని ఆయన పేర్కొన్నారు. బి.ఏ, బి.కాం, బి.ఎస్సీ విభాగాలకు సంబంధించిన విద్యార్థులకు ఆయా విభాగాల్లోని సంస్థలు, పరిశ్రమల్లో ఇంటర్న్ షిప్ ఏర్పాటు చేయుటకు అవసరమైన సంస్థలు గుర్తించి కళాశాలలు, సంబంధిత శాఖలు జాబితాలను ఇచ్చి పుచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇంటర్న్ షిప్ పై విద్యార్థులకు కూడా అవగాహన కల్పించాలని తద్వారా ఆసక్తితో హాజరుకావడం వలన ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల అధికారి పి. సీతారాము, డిగ్రీ కళాశాలల ప్రధాన అధ్యాపకులు డా.తమిరి రాధాకృష్ణ, ఏ.తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.