లబ్దిదారులకు ద్వై వార్షిక నగదు జమ


Ens Balu
4
Vizianagaram
2022-07-19 08:19:22

అర్హులై ఉండి  వేర్వేరు కారణాలతో గతం లో సంక్షేమ పధకాలు అందని లబ్దిదారులకు ద్వై వార్షిక నగదు మంజూరు కార్యక్రమం క్రింద రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బటన్ నొక్కి  లబ్దిదారుల  ఖాతాలలో మంగళవారం జమ చేసారు.  ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి ఇంట్లో సంక్షేమం, ప్రతి ఒక్కరి ముఖం లో సంతోషం చూడాలనే ఉద్ద్వేశ్యం తో సంక్షేమ పధకాలను పారదర్శకంగా అమలుజేస్తున్నామని అన్నారు. పేదల్ని వెదుక్కుంటూ  సంక్షేమ పధకాలే వెళ్లి వారి తలుపు తడుతున్నాయని,  అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పధకాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం వర్చువల్ గా జరుగగా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి , శాసన మండలి సభ్యులు డా. సురేష్ బాబు, శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య, నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఏ పి.డి కళ్యాణ చక్రవర్తి, జిల్లా వ్యవసాయ అధికారి తారక రామరావు, మత్స్య శాఖ డి డి ఎన్. నిర్మలా కుమారి  తదితరులు హాజరైనారు. అనంతరం లబ్దిదారులకు మెగా చెక్కును అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎ. సూర్య కుమారి మాట్లాడుతూ  పలు  సాంకేతిక కారణాలతో  గతం లో లబ్ది పొందని వారికీ డాక్యుమెంట్లను సరిచేసి  జిల్లాలో 15,153 మంది లబ్దిదారులకు 5.80 కోట్ల రూపాయలను  జమ చేయడం జరిగిందన్నారు. ఇందులో అధికంగా వై.ఎస్.ఆర్ పించన్ కానుక క్రింద 11,848 మంది లబ్ది దారులకు 2.96 కోట్ల లబ్ది జరిగిందని అన్నారు. వై.ఎస్.ఆర్ చేయూత, ఈ.బి.సి నేస్తం, కాపు నేస్తం, జగనన్న చేతోడు, జగనన్న వసతి దీవెన, వై.ఎస్.ఆర్ మత్స్యకార భరోసా, వాహన మిత్ర, సున్నా వడ్డీ, (ఖరీఫ్, రబీ) ఇన్పుట్ సబ్సిడీ తదితర పధకాల క్రింద లబ్దిదారుల ఖాతాల్లోనికి నగదు జమ చేయడం జరిగిందన్నారు. 

గడప గడపకు  ప్రజల వద్దకు ప్రజా ప్రతినిధులు :  శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య 
 రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పధకాల అమలు తీరును పరిశీలించడానికి , లబ్ది దారులతో ముఖా ముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోడానికి గడప గడపకు కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని, ఇందులో భాగంగా శాసన సభ్యులు, ప్రజా ప్రతినిదులంతా ఇంటింటికీ వెళ్ళడం జరుగుతోందని శాసన సభ్యులు బొత్స అప్పలనరసయ్య  తెలిపారు. ఎవ్వరికైనా ఎలాంటి సమస్య ఉన్న ప్రజా ప్రతినిధులతో చెప్పాలని అన్నారు.  ముఖ్య మంత్రి ఆదేశాలను తప్పక పాటిస్తూ ప్రజల మధ్య తిరుగుతూ వారి సంక్షే మానికి  కృషి చేస్తున్నామని అన్నారు.  ఇచ్చిన మాట ప్రకారంగా ముఖ్య మంత్రి జాతి, కుల , మత , పార్టీ బేధం లేకుండా గతం లో పొందలేని లబ్దిదారులకు అందరికీ  సంవత్సరం  లో రెండు సార్లు ప్రత్యేకంగా పధకాలను అందజేస్తున్నారని కొనియాడారు.  అంతే కాకుండా నవరత్నాలు క్రింద అర్హులైన  ప్రతి ఒక్కరికీ ఈ పధకాలు అందుతున్నాయని, నేడు విద్యా వ్యవస్థ ఇంతగా మార్పు చందడానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, నాడు-నేడు తదితర కార్యక్రమాలేనని స్పష్టం చేసారు.