ద్వైవార్షిక ప్రభుత్వ పథకాల మంజూరు కార్యక్రమం ఐ.టి.డి.ఎ సమావేశ మందిరంలో మంగళ వారం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో అర్హత ఉన్నప్పటికీ పెండింగులో ఉండటం, ఇప్పటి వరకూ మంజూరు కాని లబ్దిదారులకు మంజూరు చేశారు. జిల్లాలో 1382 మందికి 92 లక్షల రూపాయలు మేర ఆర్థిక సహాయ పథకాలు, పింఛనులు ఇతర పథకాల క్రింద 6573 మందికి రూ.1.97 కోట్లు పంపిణి చేయడం జరిగింది. పింఛన్లు, జగనన్న చేదోడు, ఇ బిసి నేస్తం, ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, వై.ఎస్.ఆర్ చేయూత, కాపు నేస్తం, నేతన్న నేస్తం, సున్నా వడ్డీ తదితర పథకాల క్రింద లబ్దిదారులకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేసారు.
రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్ జగన్మోహన రెడ్డి వర్చువల్ విధానంలో లబ్దిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకోవడం జరిగిందని, కులం, మతం, పార్టీ,వర్గం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి వివిధ సంక్షేమ పధకాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఏటా జూలై, డిశంబరు మాసాల లో వివిధ పధకాలకి అర్హులై ఉండి పలురకాల టెక్నికల్ ఇబ్బందుల వలన పధకాలు రాని వారిని గుర్తించి ద్వైవార్షిక మంజురు చేస్తున్నామని అన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు పథకాల మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామచంద్ర రావు, డిఆర్డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ వై.సత్యం నాయుడు, గ్రామ, వార్డు సచివాలయ సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, సంభందిత శాఖల అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.