గర్భిణీల ఆరోగ్య తనిఖీ ఆవశ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి. జగన్నాథ రావు అన్నారు. మాతృ మరణాలు నివారణపై పార్వతీపురం ఎన్ జి ఒ హోంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి జగన్నాథరావు అద్యక్షతన ఎమ్.డి.ఎస్.ఆర్ శిక్షణ కార్యక్రమం మంగళ వారం జరిగింది. మాస్టర్ ట్రైనర్స్ గైనకాలజిస్టులు డా. శోభారాణి, డా. సాగరిక లు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన వైద్యాధికారులు వారి పరిధిలో ఉన్న వైద్యాధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ గర్భిణీలకు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో సందర్శించాలన్నారు. గర్భిణీల ఆరోగ్య తనిఖీలు ఆసుపత్రిలో పి.ఎమ్.ఎస్.ఎం.ఎ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా జరగాలని ఆయన ఆదేశించారు. హై రిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తద్వారా మాతృ మరణాల నివారణకు కృషి చేయాలని జగన్నాథరావు సూచించారు. జిల్లాలో మాతృ శిశు మరణాలు జరగకుండా ప్రతి ఒక్క వైద్య ఆరోగ్య సిబ్బంది కృషి చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా సి. దుర్గా కళ్యాణి, ప్రోగ్రాం అధికారులు డా. జగన్మోహన్ , డా. అనిల్ , డా. సందీప్ పాల్గొన్నారు.