రాష్ట్రంలో ప్రతి రైతుకు ఈ క్రాప్ నమోదు ద్వారా వ్యవసాయ ఫలాలు అందాలని వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ. పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం విశాఖపట్నం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు , జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన, పట్టుపరిశ్రమ మరియు రెవిన్యూ అధికారులతో ఈ క్రాప్ నమోదుపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వ్యవసాయదారుడు కి పండించే ప్రతి పంట ఇ-క్రాపు ద్వారా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి చేయవలసిన కార్యాచరణ పై పలు సూచనలను తెలియజేశారు. పట్టాదారు రైతులతో పాటు కౌలు రైతులందరికీ కూడా ఇ-క్రాప్ ఫలాలు అందాలని వెల్లడించారు. కౌలు రైతులకు ఇ-క్రాప్ నమోదు సమయంలో భూ యజమానులు ఎటువంటి భయాందోళనలకు గురి కావలసిన అవసరం లేదని తెలియజేశారు. భూమి యాజమాన్య హక్కులు సంబంధిత భూయజమానికి మాత్రమే చెందుతాయని, కేవలం పంట నష్టం పరిహారం మాత్రమే కౌలు రైతులకు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఇ పంట నమోదు చేసినట్లయితే వై.ఎస్.ఆర్.సున్నావడ్డీ పంట రుణాలు, వై.ఎస్.ఆర్ ఉచిత పంటల భీమా పథకం, పంట నష్ట పరిహారంతో పాటు ధాన్యం కొనుగోలు కూడా చేసుకోవచ్చని తెలియజేసారు. అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను రెవెన్యూ గ్రామాలకు అనుసంధానం చేయాలన్నారు . గ్రామాల నుండి వి.ఎ.ఎ/వి.ఆర్.ఓ పంటలు నమోదు చేయాలని, మండలాల నుండి తహసిల్దార్లు/మండల వ్యవసాయ అధికారులు వి.ఎ.ఎ/వి.ఆర్.ఓలకు శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుండి డా. ఏ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాథన్, డిఆర్ఓ శ్రీనివాస్ మూర్తి, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పాల్గొన్నారు.