గృహ నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళిక
Ens Balu
10
Kakinada
2022-07-19 15:08:11
నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో చేపట్టిన జగన్న కాలనపీల్లో ఇళ్ళ గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్ కె.రమేష్ ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ళ నిర్మాణం ప్రగతిపై అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావుతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గృహనిర్మాణానికి అవసరమైన వ్యయంలో రూ.1.80లక్షలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీగా అందిస్తున్నాయన్నారు. మిగిలిన సొమ్మును పైవేటు ఆర్థిక సంస్థలు, ఇతర మార్గాలు ద్వారా సమకూర్చేందుకు లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలన్నారు. మరో వైపు గతంలో టిడ్కో గృహాల కోసం రూ.25వేలు నుంచి రూ.లక్ష వరకు సొమ్ములు చెల్లించిన దాదాపు 1052 మంది లబ్ధిదారులకు ఇళ్ళు మంజూరు కాలేదని, వీరందరంతా జగనన్నకాలనీల్లో ఇళ్ళు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని కోరారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న గృహనిర్మాణ లబ్ధిదారులకు రూ.35వేలు అందించేలా బ్యాంకులతోఎప్పటికప్పుడు మాట్లాడి సమన్వయం చేయాలని సూచించారు. ఇళ్ళు గ్రౌండింగ్ కాకపోతే రద్దయ్యే అవకాశం ఉన్నందున వెంటనే ఇళ్ళు ప్రారంభించేలా ప్రత్యేకాధికారులు చూడాలన్నారు. నగరపాలక సంస్థ ఏడీసీ నాగనరసింహారావు మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు నిర్థిష్ట ప్రణాళికతో సచివాలయ కార్యదర్శుల సహకారంతో ప్రణాళిక బద్ధంగా గ్రౌండింగ్ ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు, గృహనిర్మాణశాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.