రైతు సంక్షేమం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి వాటితో పాటు పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా ఈ-క్రాప్ డేటా ఆధారమవుతున్నందున ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య విశాఖపట్నం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ కోర్టుహాల్ నుంచి కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ, ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్.. జిల్లా అధికారులతో మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశించారు. కొత్త యాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని.. అత్యంత కచ్చితత్వంతో పంట వివరాల నమోదుకు ఈ యాప్ వీలుకల్పిస్తుందని వివరించారు. గతంలో ఒక్క గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) మాత్రమే డేటా సేకరించేవారని.. ఈసారి వీఏఏ, వీఆర్‌వో, విలేజ్ సర్వేయర్ల ఉమ్మడి బృందం ఈ ప్రక్రియలో భాగస్వామ్యమవుతుందని కలెక్టర్ తెలిపారు. ఆర్‌బీకే యూనిట్‌గా ఈ-క్రాప్ జరుగుతున్నందున వాటితో రెవెన్యూ గ్రామాల అనుసంధాన ప్రక్రియ జరగాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్.విజయకుమార్, ఉద్యానశాఖ అధికారి బీవీ రమణ, ఏడీ(ఏ) జీవీ పద్మశ్రీ తదితరులు హాజరయ్యారు.