విజయనగరం శిల్పారామంలో ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసిన మత్స్య ఉత్పత్తుల ప్రదర్శన, ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఏర్పాటు చేసిన జిల్లాకు చెందిన సమరయోధుల జీవిత విశేషాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ప్రదర్శనలు ఏర్పాటు చేయగా నగరంలోని పలువురు తమ కుటుంబాలతో కలసి మత్స్య శాఖ స్టాళ్లను, స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించి అరుదైన ఫోటోలను తిలకించి ఆనందించారు. మత్స్యశాఖకు సంబంధించి ఫిష్ ఆంధ్ర మార్టు, లైవ్ ఫిష్ విక్రయాలు, మత్స్య ఉత్పత్తులను వివిధ రకాల ఆహార పదార్ధాలుగా రూపొందించి రొయ్యలు, చేపలతో చేసిన వంటకాలు, అక్వేరియం తదితర అలంకరణ మత్స్య ఉత్పత్తులు, అక్వాలాబ్ సేవలు, మత్స్యకారులకు ఉద్దేశించిన పథకాలకు సంబంధించిన బ్యానర్లు ప్రదర్శించారు. మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి ఆధ్వర్యంలో మత్స అభివృద్ధి అధికారులు చాందిని, మత్స్య సహాయకులు పాల్గొన్నారు.
75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలకు సంబంధించి నిర్వహిస్తున్న ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాకు చెందిన 30 మంది స్వాతంత్య్ర సమరయోధుల అరుదైన ఫోటోలు, వారి జీవిత విశేషాలు, వారు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఘటనలకు సంబంధించి విశేషాలతో సమాచార శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ఆకట్టుకుంది. ఫోటోలను తిలకించడంతోపాటు సందర్శకులు వారి జీవిత విశేషాలను కూడా ఆసక్తిగా తెలుసుకున్నారు. జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి డి.రమేష్, సహాయ కార్యనిర్వాహక ఇంజనీరు మల్లేశ్వరరావు, ఏ.వి.ఎస్. డి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గంట్యాడ మండలం లఖిడాంకు చెందిన పాశల కృష్ణ స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలకు సంబంధించి తాను ప్రచురించిన పుస్తకాల ప్రతులను సమాచార శాఖ జిల్లా అధికారులకు అందజేశారు.