ఆహా మత్స్య ఉత్పత్తుల వంటకాల రుచులు


Ens Balu
13
Vizianagaram
2022-07-24 16:14:30

చేపల పులుసు..చేపల వేపుడు.. చేపల నూడిల్స్.. చేపల లాలీపాప్స్.. బోన్ లెస్ చేపల ఫ్రై.. చేపల బర్గర్.. చేపల ఊరగాయ.. రొయ్యల వేపుడు.. చేపల కట్లెట్.. రొయ్యల ఊరగాయ..ఇలా అన్నీ చేపలు రొయ్యలతో తయారు చేసిన వంటకాలే.. ఏంటి ఇదేదో ఫైవ్ స్టార్ హోటల్ లో కాస్ట్లీ మెనూ అనుకుంటున్నారా.. అలా అనుకుంటే చేప ముల్లు గుచ్చుకుంటుంది జాగ్రత్త..నోరూరించే ఈ వంటకాలన్నీ  విజయంనగంలోని శిల్పారామంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ లలో మత్స్యకారులే స్వయంగా వండిన వంటకాలు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రజల అవగాహనకై వీటిని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలాకుమారి ఆధ్వర్యంలో మత్స్యకారులు ఈ వంటకాలన్నీ సందర్శకులకు రుచి చూపించారు. స్టాల్ వద్దకు వచ్చిన వారందరికీ గ్రామీణ మత్స్య సహాయకులు చేపలు వాటి రకాలు, ఉత్పత్తుల కోసం వివరిస్తే.. ఫిష్  ఆంధ్ర పథకం ద్వారా మత్స్యకార మహిళలు నిర్వహిస్తున్న వాల్యూ యాడెడ్  ప్రోడక్ట్స్ ను పర్యాటకులకు, అక్కడికి వచ్చిన వారికి లైవ్ గా తయారు చేసి మరీ రుచి చూపించారు. వీటిని తిలకించిన వారంతా చేపల ఉత్పత్తులు ఇన్ని రకాలు ఉన్నాయా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చేపలు, రొయ్యలతో ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ను అక్కడికక్కడే చేశారేమో ఆ ప్రాంగణమంతా ఒక్కటే గుమ గుమలు. ఈ స్టాల్ దగ్గరకి వచ్చినవారంతా చేపల వంటకాలు రుచి చూసిన తరువాతే వెనుతిరిగారంటే ఎంతగా ఈ ప్రదర్శన ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.    ఏఏ రకాల మత్స ఉత్పత్తులతో ఏ ఏ రకాల తినుబండారాలు తయారు చేస్తారు వాటి విలవలను ఈ సందర్భంగా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మల కుమారి కూడా పలువు ప్రముఖులకు ప్రభుత్వ అధికారులకు తెలియజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మత్స్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు మత్స్య ఉత్పత్తులపై అవగాహన కల్పించడంతోపాటు మత్స్యకారులకు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో వాల్యూ ఎడిట్ ప్రొడక్ట్స్ కు ప్రజలు, సందర్శకులు, పర్యాటకుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. చేపల వేపుడు రొయ్యల వేపుడు చేపల కూర చేపల పచ్చడి తదితర అంశాలతో ఈ ప్రదర్శనను  ప్రదర్శనలో ఉంచినట్టు ఆమె పేర్కొన్నారు. అధికంగా ప్రజలు మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యంతోపాటు.. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు గ్రామీణ మత్స్యకార సహాయకులు మత్స్యశాఖకు చెందిన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.