తొలిరోజు సచివాలయ పరీక్షలు విజయవంతం..


Ens Balu
4
Srikakulam
2020-09-20 16:57:38

శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా జరిగిన గ్రామ,వార్డు సచివాలయ పోస్టుల నియామక పరీక్షలు తొలిరోజు విజయవంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల నియామకం కొరకు నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్వయంగా పరిశీలించారు. అందులో భాగంగా  శ్రీకాకుళం రూరల్ మండలం మునసాబుపేటలో గల గాయత్రి జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆదివారం ఉదయం కలెక్టర్ సందర్శించారు. ముందుగా అభ్యర్థులకు కరోనాకు సంబంధించి థర్మల్ టెస్ట్ చేస్తున్న తీరుతెన్నులను ఏ.ఎన్.ఎం లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు నిర్వహిస్తున్న గ్రామ,వార్డు సచివాలయ పరీక్షలకు అన్నిరకాల ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్ధులకు స్క్రీనింగ్ టెస్ట్ మొదలు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, కరోన లక్షణాలు ఉన్న వారికి ప్రత్యేక గదుల ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు రాయడానికి వచ్చిన విభిన్న ప్రతిభావంతుల కోసం 17 పరీక్షా కేంద్రాల వద్ద వీల్ చైర్లు, సహాయం కోసం రెడ్ క్రాస్ వాలంటీర్లను ఏర్పాటు చేసామని జిల్లా కలెక్టర్ తెలిపారు. దీనివలన జిల్లాలో ఎక్కడ ఎటువంటి సమస్యలు తలెత్తలేదని, అభ్యర్థులు ఏ.పి.పి.ఎస్.సి సూచించే నియమ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు రాశారని కలెక్టర్ తెలిపారు. రాబోయే ఆరు రోజులు కూడా ఇదే స్థాయిలో ఏర్పాట్లు చేస్తూ పరీక్షలను విజయవంతం చేస్తామని కలెక్టర్ వివరించారు.  సంయుక్త కలెక్టర్ డా . కె.శ్రీనివాసులు   కూడా  నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పలు సూచనలు  చేశారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.