పార్వతీపురం మన్యం జిల్లాలో వై.యస్.ఆర్ కాపు నేస్తం పథకం క్రింద ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం శుక్ర వారం జరుగుతుందని బి.సి.కార్పొరేషన్ ఇన్ ఛార్జ్ కార్యనిర్వా హక సంచాలకులు ఆర్. గడ్డెమ్మ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీ చేశారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల జీవనోపాధి అవకాశాలు, జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించడం కోసం సంవత్సరానికి రూ.15,000/-ల చొప్పున ఐదు సంవత్సరాలకి రూ.75,000/-లు ఆర్ధిక సహాయం చేయుటకు ప్రభుత్వం పథకాన్ని అమలు చేస్తుందని వివరించారు. గ్రామీణ ప్రాంత లబ్దిదారుల కుటుంబ నెలసరి ఆదాయం రూ.10 వేలు, పట్టణ ప్రాంతంలో రూ.12 వేలు లోబడి ఉన్నవారు పథకానికి అర్హులని ఆమె పేర్కొన్నారు. సమగ్ర కుల దృవీకరణ పత్రం, ప్రభుత్వం జారీచేసిన గుర్తింపు కార్డు లేదా ఆధార్ కలిగి ఉండాలని, బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వము నుండి ఉద్యోగ విరమణ పింఛను పొందుతున్నవారు, ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్హులని ఆమె స్పష్టం చేశారు. కుటుంబంలో ఎవరికైనా మాగాణి భూమి మూడు ఎకరములు పైబడి లేదా మెట్ట భూమి 10 ఎకరములకు పైబడి లేదా మాగాణి, మెట్ట భూమి వెరసి 10 ఎకరములకు పైబడి ఉన్నా, కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరికైన నాలుగు చక్రముల సొంత వాహనము కలిగి ఉన్నా పథకానికి అనర్హులని చెప్పారు. పట్టణ ప్రాంతములో కుటుంబ సభ్యులలో ఎవరికైనా వెయ్యి చదరపు అడుగులకు పైబడి సొంత నివాస గృహము ఉన్నవారు కూడా అనర్హులని ఆమె సూచించారు.
2020-21 సంవత్సరంలో 1,398 మంది లబ్ధిదారులకు రూ.2.097 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో 1,384 మందికి రూ.2.076 కోట్లు కాపు నేస్తం క్రింద అందించటం జరిగిందని ఆమె తెలిపారు. 2022-23 సంవత్సరానికి వై.యస్.ఆర్. కాపు నేస్తం క్రింద పార్వతీపురం మన్యం జిల్లాలో 1,429 మందికి రూ.2.145 కోట్లు పంపిణీ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. కురుపాం నియోజక వర్గంలో 165 మంది లబ్ధిదారులకు రూ.24.80 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. పాలకొండ నియోజక వర్గంలో 295 మంది లబ్ధిదారులకు రూ.44.30 లక్షలు, పార్వతీపురం నియోజక వర్గంలో 463 మంది లబ్ధిదారులకు రూ.69.50 లక్షలు, సాలూరు నియోజక వర్గంలో 506 మంది లబ్ధిదారులకు రూ.75.90 లక్షలు ఆర్థిక సహాయం అందుతుందని ఆమె పేర్కొన్నారు.