ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిదిపైనా ఉందని నగర మేయర్ మహమ్మద్ వసీం పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అటవీశాఖ, ఆన్ సెట్ సంయుక్త ఆధ్వర్యంలో కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి నగర మేయర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వసీం మాట్లాడుతూ, లాక్‍డౌన్ సమయంలో కాలుష్యం లేని వాతావరణాన్ని మనమంతా చూశామని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో లాక్‍డౌన్ మనకు చూపించిందన్నారు. ఇదే సందర్భంలో ఆక్సిజన్ విలువ కూడా కోవిడ్ విపత్తు మనకు తెలియచేసిందని,ఉచితంగా లభించే ఆక్సిజన్ డబ్బులు పెట్టినా మనకు దొరకని పరిస్థితి మనం చూశామని గుర్తు చేశారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరూ చెట్లు నాటడమే కాకుండా వాటిని రక్షించాలి సూచించారు. అంతేకాకుండా ప్లాస్టిక్ నిర్ములన కూడా పర్యావరణ పరిరక్షణలో ఎంతో ముఖ్యమైనదని,పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణలో తమ పాలకవర్గం అండగా నిలుస్తుందని మా వంతు సహకారాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో,ఆన్ సెట్ కేశవ నాయుడు,జిల్లా అటవీశాఖ అధికారి చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ శంకరయ్య,కార్పొరేటర్ అనీల్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మీ రంగయ్య,డాక్టర్ సింధూర రెడ్డి వైసీపీ నాయకులు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.