విజయనరగరం జిల్లాలోని రంగస్థల వృద్ధ కళాకారులకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్తగా పింఛన్లను మంజూరు చేయుటకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి. రమేష్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదైనా కళారంగానికి చెంది 58 ఏళ్ల వయసు నిండిన వారు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారు వృద్ధ కళాకారుల పింఛను కొరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత దరఖాస్తును జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో లేదా vizianagaram.ap.gov.in వెబ్ సైట్ ద్వారా లబ్ధిదారులు పొందవచ్చని తెలిపారు. నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి చేసిన దరఖాస్తులను ఆగస్టు 6వ తేదీలోగా స్వయంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం, కలెక్టరేట్ కాంప్లెక్సు, మొదటి అంతస్తు, రూం. నెం.16 చిరునామాలో అందజేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు రెండు పాస్ ఫోర్టు సైజు ఫోటోలు, కళాకారునిగా గుర్తింపు పత్రం, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ లేదా బియ్యం కార్డు జెరాక్స్ కాపీలను తప్పనిసరిగా జతచేయాలని సూచించారు.