చెరువు గట్లు ఆహ్లాదకరంగా తయారు చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు. అమృత్ సరోవర్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, తదితర వాటిపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఉపాధి హామీ పథకం కింద బాగుచేయడం జరిగిందని, ఆ చెరువు గట్లను ఆహ్లాదకరంగా, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. చెరువు గట్లు పై మొక్కలు నాటి కూర్చోడానికి బెంచ్ లు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రాలుగా మార్చాలని ఆదేశించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాల్లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ను ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అభినందించారు. లక్ష్యాలకు చేరువ కావాలన్నారు. జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో లక్ష్మీపతి, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ రోజారాణి, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.