అజాదీకా అమృత్ మహోత్సవాలు నేటి యువతలో స్ఫూర్తి నింపుతాయని జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు పేర్కొన్నారు. అమృతోత్సవాల్లో భాగంగా పట్టణంలోని మూడులాంతర్లు నుంచి గంటస్తంభం వరకు, 150 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో, హెరిటేజ్ వాక్ పేరుతో, ఉజ్వల భారత్, ఉజ్వల్ భవిష్యత్ ర్యాలీని నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఈ ర్యాలీ జరిగింది. విద్యుత్ రంగంలో సాధించిన ఘన విజయాలను ఈ ర్యాలీలో వివరించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డిఆర్ఓ గణపతిరావు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు యువతలో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రగిలించేందుకు దోహదపడతాయని అన్నారు. అన్ని రంగాల్లో దేశం సాధించిన విజయాలను వివరించేందుకు ఉజ్వల భారత్, ఉజ్వల భవిష్యత్ నినాదంతో దేశవ్యాప్తంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. అన్ని గ్రామాలను విద్యదీకరణ చేయడం, విద్యుత్ రంగంలో సాధించిన విజయంగా పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కృషితో, ప్రతీ ఇంటికీ విద్యుత్ సరఫరా చేయడం జరిగిందని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న ఈ అమృతోత్సవాలు, వందేళ్ల ఉత్సవాలకు పునాది లాంటివని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి విక్రమాదిత్య, ఉత్సవాల జిల్లా నోడల్ అధికారి, ఎన్‌టిపిసి డిజిఎం పి.ఆనంద్‌బాబు, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ పి.నాగేశ్వర్రావు, ఇఇ కృష్ణమూర్తి, జిల్లా పర్యాటకాధికారి పిఎన్‌వి లక్ష్మీనారాయణ, జిల్లా పశుసంవర్థక శాఖాధికారి డాక్టర్ వైవి రమణ, విద్యుత్ శాఖ ఉద్యోగులు, విద్యాశాఖాధికారులు, ఎన్‌సిసి కేడెట్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.