ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన జరగనున్న రెవెన్యూ డిపార్టుమెంట్‌లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) పోస్టుల నియామకం కోసం నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. గణపతిరావు అధికారులను ఆదేశించారు. గ్రూప్ -4 పరీక్ష నేపథ్యంలో శుక్రవారం ఆయన స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో లైజన్ అధికారులు, సహాయక లైజన్ అధికారలు, చీఫ్ సూపరిండెంట్స్, పోలీస్, ఆర్టీసీ, మెడికల్, విద్యుత్ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అనుసరించాల్సిన విధి విధానాలపై మార్గదర్శకాలు జారీ చేశారు. జరిగిన ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 52 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని, 19,153 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఉదయం 11.00 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని వివరించారు. అభ్యర్థులను గ్రేస్ పిరియడ్ 5 నిమిషాలతో కలిపి ఉదయం 10.30 నుంచి 11.00 గంటల వరకు అనుమతించ వచ్చని స్పష్టం చేశారు. 11.00 తర్వాత ఒక నిమిషం ఆలస్యమైనా ఎవరినీ కేంద్రం లోపలికి అనుమతించరాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత విభాగాల అధికారులందరూ సమన్వయ లోపం లేకుండా అన్ని ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షను నిర్వహించాలని చెప్పారు. ప్రధానంగా లైజన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అందరితీ కో-ఆర్డినేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష నిర్వహణకు సంబంధించిన మెటీరియల్‌ను జాగ్రత్తగా తీసుకొని వెళ్లాలని, కేంద్రాల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని సూచించారు.
నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా జాగ్రత్త వహించాలని విద్యుత్ శాఖ అధికారులను, సమయానికి కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రం వద్దా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ అధికారి శణ్ముఖరావు, సహాయ సెక్షన్ అధికారి గోపాల్, జిల్లా ప్రజా రవాణా అధికారి శ్రీనివాసరావు, ఈపీడీసీఎల్ ఈఈ ధర్మరాజు, ఏపీఆర్వో నారాయణరావు, లైజన్ అధికారులు, సహాయక లైజన్ అధికారులు, వివిధ పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.