తెలుగు సాహిత్య, సంగీత రంగంలో సినారే సేవలు ప్రశంసనీయమని ఆంధ్రాయూనివర్సిటీ నృత్యవిభాగ ఉపాధ్యాయురాలు కె.వి.విజయవేణి కొనియాడారు. శుక్రవారం సాయంత్రం విశాఖలోని డాబాగార్డెన్స్ వీజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో తెలుగువీర సంస్థానం ట్రస్ట్ ఆధ్వర్యంలో నాట్యాచార్యులు వెంపటి చినసత్యం వర్ధంతి, ప్రముఖ భాషావేత్త, కవి సి.నారాయణరెడ్డి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన వందలాది మంది చిన్నారులు కూచిపూడి, జానపద, శాస్ర్తీయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవేణి మాట్లాడుతూ, వెంపటి చినసత్యం యుగంను నాట్య యుగంగా పేర్కొనవచ్చన్నారు. ఆయన హయాంలో శాస్ర్తీయ నృత్యాలకు పెద్ద పీటవేశారన్నారు. ఇక తెలుగు సినిమా రంగంలో సి.నారాయణరెడ్డి అందించిన కథలు, రచనలుతో పాటు ఆయన రచించిన విశ్వంభర గ్రంథానికి జ్ఞానపీఠ్ అవార్డు లభించిందన్నారు. వీరిద్దరూ భాషాభిమానులేనని వారి వల్లే ప్రస్తుత, భవిష్యత్ తరాలకు కూడా ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిలాయన్నారు. గౌరవ అతిధిగా హాజరైన అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు , జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ తెలుగువీరసంస్థానం ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమాలు అభినందనీయమన్నారు. శాస్ర్తీయ నృత్యాల వల్ల పిల్లలకు ఆధ్యాత్మిక భక్తిభావం పెరుగుతుందని, అంకితభావం, క్రమశిక్షణ కూడా అలవడుతాయన్నారు. అనంతరం కార్యక్రమం నిర్వాహకులు సంస్థానం ట్రస్టు అధ్యక్షులు దొడ్డి శివకుమార్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా తెలుగుభాషకు సంబంధించిన అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.