అన్నవరం శ్రీశ్రీశ్రీ వీరవేంకట సత్యన్నారాయణ స్వామివారి దేవస్థానం అధికారులు నిర్లక్ష్యం ఆగమ విద్యకు మంగళం పాడేలా వుంది. ప్రతీ ఏటా ఆగమపాఠశాల ప్రవేశాల విషయంలో అధికారుల ప్రచార లోపం విద్యార్ధులకు శాపంగా మారుతోంది. దీనితో ప్రతీ ఏడాదీ విద్యార్ధుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. దానికి ఈ ఏడాది వచ్చిన దరఖాస్తులే నిదర్శనంగా కనిపిస్తున్నాయి. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలోని అన్నవరం శ్రీ సత్యదేవ స్మార్త ఆగమ పాఠశాలలో స్మార్త ఆగమ విద్యను అధ్యయనం చేయడానికి కేవలం 23 మంది విద్యార్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. కనీసం వచ్చిన దరఖాస్తు దారులందరికీ అవకాశం కల్పించే విధంగా మీడియా ద్వారా కనీసం ఎప్పుడు తరగతులు ప్రారంభించే విషయం కూడా తెలియజేయకపోవడం అత్యంత దారుణం దీనితో దరఖాస్తు చేసుకున్నావారిలో కేవలం 19 మంది విద్యార్ధులు మాత్రమే హాజరు కావడంతో.. ఆ వచ్చిన విద్యార్ధులకే నేటి నుంచే దేవస్థానం వైదిక కమిటీ సంక్షేములో విద్యార్థులను పరిశీలన చేశారు. వారికే 5 సంవత్సరముల కోర్సు అధ్యయనం చేయుటకు గాను ఎంపిక చేశారు. వాస్తవానికి అన్నవరం ఆగమ కోర్సుకు మంచి డిమాండ్ వుంది. అయితే దానిని అధికారులు వారి వారి స్వలాభం కోసం దీనిపై ప్రచారం తగ్గించేయడంతో అసలు ఇక్కడ ఆ కోర్సు చెబుతున్నదీ లేనిదీ తెలియకుండా పోతుంది. ఈ దేవస్థానంలో ఆదాయ మార్గాలపై చూపించే చొరవ వేద విద్యార్ధులకు ఆగమ పాఠశాల యొక్క గొప్పతనాన్ని..అందులో విద్యార్ధుల సంఖ్యను పెంచే విషయంలో చూపలేకపోవడం దారుణం. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది విద్యార్ధుల తల్లిదండ్రులు దేవాదాయశాఖ ద్రుష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం అత్యంత శోచనీయం. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చేఏడాది పది మంది విద్యార్ధులు కూడా వేద విద్యకు దరఖాస్తు చేసుకునే పరిస్థితులు కూడా కనిపించేటట్టుగా లేవు..!