105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్


Ens Balu
10
Srikakulam
2022-08-02 07:16:32

జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య ఆంధ్రుడు కావడం తెలుగుజాతికి గర్వకారణం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనం, గాంధీ మందిరంలో మంగళవారం పింగళి వెంకయ్య 144వ జయంతి వేడుకలు, జాతీయ జెండా రూపకల్పన చేసిన వందేళ్లు పూర్తయిన సందర్భంగా 105 అడుగుల జాతీయ జెండా ట్రయల్ రన్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ జాతీయ పతాకావిష్కరణ చేశారు. తొలుత పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ జెండా ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని పెంపొందించేలా.. ఉత్సాహం ఉరకలేసేలా చేస్తోందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వస్తుందనే నమ్మకం అంతకుముందే పింగళి వెంకయ్య గుర్తించి పతాకాన్ని రూపొందించడం గొప్ప విషయమన్నారు. గాంధీ మందిరం సమరయోధుల స్పూర్తివనంలో కమిటీ నిర్వాహకులంతా పదవులు, హోదాలతో ప్రమేయం లేకుండా అందరూ వలంటీర్లుగా పనిచేయడం శుభపరిణామమన్నారు. సిక్కోలు జిల్లాలో గాంధీ మందిరం ఏర్పాటు కావడం ఓ చరిత్ర అయితే ఎందరో సమరయోధుల స్పూర్తివనం మరో చరిత్ర అని ఆయన కొనియాడారు. 

105 అడుగుల జాతీయ జెండాతో సిక్కోలు జిల్లా మరో రికార్డు సృష్టించిందని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు సిక్కోలులో ఘనంగా జరుగుతాయనడానికి ఇక్కడ జరుగుతున్న వేడుకలే ఓ సంకేతమన్నారు. ఈ ట్రయల్ రన్ కార్యక్రమంలో కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ మునిసిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, సెట్ శ్రీ సీఈవో ప్రసాదరావు, డీఎడీవో మాధురి, విశ్రాంత డీఈవో బలివాడ మల్లేశ్వరరావు, తహసీల్దార్ వెంకటరావు, గాంధీ మందిరం నిర్వాహకులు ఎం.ప్రసాదరావు, సురంగి మోహనరావు, నటుకుల మోహన్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ జామి భీమశంకర్, కొంక్యాన వేణుగోపాల్, డాక్టర్ బాబాన దేవభూషణ్, మహిబుల్లా ఖాన్, ఆచంట రాము, నిక్కు అప్పన్న, ప్రొఫెసర్ విష్ణుమూర్తి, కొంక్యాన మురళీధర్, ఎం.వి.ఎస్.ఎస్.శాస్త్రి, పందిరి అప్పారావు, భట్లు, నిక్కు హరిసత్యనారాయణ, గుత్తు చిన్నారావు, నక్క శంకరరావు, పెంకి చైతన్య, పొన్నాడ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. 

దాతలను సత్కరించిన కలెక్టర్
మహాత్మా గాంధీ మందిరం, సమరయోధుల స్పూర్తివనంలో 105 అడుగుల జాతీయ జెండా రూపకల్పన కోసం నగరంలోని వివిధ రంగాల ప్రముఖులు పెద్దఎత్తున విరాళాలు అందించారు. ప్రముఖ శిశువైద్య నిపుణులు, ఐతమ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు రూ.లక్ష, పీవీఎస్ రామ్మోహన్ ఆసుపత్రుల అధినేత పీవీఎస్ రామ్మోహన్ రూ.2 లక్షలు, వి డెంటల్ అధినేత డాక్టర్ జాన్, మేనేజర్ రామ్మోహన్ రూ.25 వేలు, కేవీఎస్ఎన్ వర్మ రూ.పదివేలు, కళింగవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రూ.పదివేలు, పారిశ్రామికవేత్త నడికుదిటి ఈశ్వరరావు (ఎఈఆర్) రూ.50 వేలు విరాళం ఇచ్చారు. వీరిని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ దుశ్శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. 105 అడుగుల జెండా నిర్మాణ కార్యక్రమంలో భాగస్వామిగా ఉన్న ఆచంట రాము, బజాజ్ ఎలక్ట్రికల్స్ సంస్థ సాంకేతిక విభాగ ప్రతినిధులు ధర్మేంద్ర, హుస్సేన్లను కూడా కలెక్టర్ సత్కరించారు.