ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని నగరంలో మంగళవారం నిర్వహించిన సమైక్యతా ర్యాలీ స్ఫూర్తిదాయకంగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జాతి నేతలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా స్థానిక గురజాడ సర్కిల్ వద్ద పింగళి వెంకయ్య చిత్ర పటానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో గణపతిరావు, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతీ దేవి, గురజాడ మనవరాలు ఇందిర, ఇతర అధికారులు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులు 100 అడుగులు జాతీయ పతాకాన్ని చేత బట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగింపులో మహారాజ ప్రభుత్వ సంగీత కళాశాల ప్రాంగణంలో ఉన్న హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు, వయోలిన్ విధ్వాంసుడు ద్వారం వెంకటస్వామినాయుడు విగ్రహాలకు ఎమ్మెల్యే, జేసీ, డీఆర్వో పూలమాలలు వేశారు.
మహనీయుల త్యాగాలు మరువలేనివి..
కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మీడియాతో మాట్లాడారు. దేశ స్వాతంత్య్ర కోసం అహర్నిశలూ శ్రమించి.. జీవితాలను త్యాగం చేసిన మహనీయుల సేవలు మరువలేనివని పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పేలా ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జాతీయ పతాకం రూపకర్తి పింగళి వెంకయ్యకు ఘనమైన నివాళి అర్పించి జాతి సమైక్యతను చాటి చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
పింగళి చిత్రపటానికి పుష్పాంజలి
పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డీఆర్వో ఎం. గణపతిరావు, జిల్లా స్థాయి అధికారులు పుష్పాంజలి ఘటించారు.కార్యక్రమాల్లో నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ రేవతీ దేవి, జిల్లా యువజన అధికారి విక్రమాధిత్య, డీఎస్‌డీవో అప్పలనాయుడు, డీఆర్డీఏ పీడీ కల్యాణ చక్రవర్తి, పర్యాటక శాఖ అధికారి లక్ష్మీ నారాయణ, డీఈవో స్వామినాయుడు, మెప్మా పీడీ సుధాకర్, వయోజన విద్యా శాఖ డీడీ సుగుణాకర్ రావు, కలెక్టరేట్ ఏవో దేవ్ ప్రసాద్, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.